Begin typing your search above and press return to search.

రేఖ‌కు పెట్టిన రూ.65ల‌క్ష‌ల ఖ‌ర్చు వృధా

By:  Tupaki Desk   |   12 April 2017 7:58 AM GMT
రేఖ‌కు పెట్టిన రూ.65ల‌క్ష‌ల ఖ‌ర్చు వృధా
X
ప‌లుకే బంగార‌మా? అన్న‌ట్లుగా ఉంది బాలీవుడ్ దిగ్గ‌జ న‌టి రేఖ‌.. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ వ్య‌వ‌హారం. వారి.. వారి రంగాల్లో చాలా పీకేసిన తోపులుగా పేరున్న ఇలాంటి ప్ర‌ముఖుల్ని.. గౌర‌వించి పెద్ద‌ల స‌భ‌కు పంపితే.. వారేం చేస్తున్నారో తెలిసిన‌ప్పుడు అవాక్కు అవ్వాల్సిందే. తామున్న రంగాల్లో అత్యున్న‌త స్థాయికి ఎదిగిన ప్ర‌ముఖుల్ని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తే.. వారు ప్రాతినిధ్యం వ‌హించిన రంగాల‌కు మరింత వ‌న్నె తెస్తార‌న్న ఒక అత్యాశ‌ను అధికార‌ప‌క్షాలు చెబుతుంటాయి.

ఓట్లేసి అధికారాన్ని ద‌ఖ‌లు ప‌ర్చిన త‌ర్వాత‌.. ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వారి ప‌ద‌వీ కాలం పూర్తి అయ్యే వ‌ర‌కూ వారేం చేసినా.. చూస్తూ ఊరుకోవ‌ట‌మే త‌ప్పించి ఇంకేమీ చేయ‌లేని సామాన్యులు.. రేఖ‌.. స‌చిన్ టెండూల్క‌ర్ లాంటి వారికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాలు క‌ట్ట‌బెట్టిన‌ప్పుడు ఏమీ మాట్లాడ‌లేక‌పోయారు. ఇలాంటి వారు షో పీసులుగా క‌నిపిస్తారే త‌ప్పించి.. వారితో పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న మాట‌ను కొంత‌మంది చెప్పినా.. వారి నోటిని మూసేసిన వారు చాలామందే ఉన్నారు.

2012 ఏప్రిల్‌ లో రాజ్య‌స‌భ‌కు 12 మందిని నామినేట్ చేయ‌గా.. వారిలో రేఖ‌.. స‌చిన్ ఇద్ద‌రూ ఉన్న‌రు. మిగిలిన వారితో పోలిస్తే.. వీరిద్ద‌రి హాజ‌రు పేల‌వంగా ఉండ‌ట‌మే కాదు.. స‌భ‌లో వారి పాత్ర చాలా దారుణంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం పొందిన ఐదేళ్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కూ రాజ్య‌స‌భ 348 రోజులు కొలువు తీరితే.. రేఖ అతి క‌ష్ట‌మ్మీద 18 రోజులు హాజ‌రైతే.. స‌చిన్ టెండూల్క‌ర్ మాత్రం 23 రోజులు వ‌చ్చారు. ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూఒక్క‌సారి అంటే ఒక్క‌సారి ప్ర‌శ్న వేయ‌ని అరుదైన రికార్డును రేఖ త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆమెతో పోలిస్తే.. స‌చిన్ కాస్త మెరుగ‌ని చెప్పాలి. ఇన్ని రోజుల్లో ఆయ‌న 22 ప్ర‌శ్న‌లు సంధించారు.

ఇంత‌గా పొడిచేసిన వారికి ప్ర‌జాధ‌నం మాత్రం భారీగానే ఖ‌ర్చు అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రేఖ‌తో పాటు నామినేట్ అయిన ప‌న్నెండు మంది స‌భ్యుల్లో ఒక్క ప్ర‌శ్న సంధించ‌ని రేఖ‌కే భారీగా ఖ‌ర్చు పెట్టాల్సి వ‌చ్చింద‌ని వెల్ల‌డైంది. రేఖ‌కు రూ.65 ల‌క్ష‌లు జీత‌భ‌త్యాల కింద ప్ర‌భుత్వానికి ఖ‌ర్చు అయితే.. స‌చిన్‌ కు రూ.58.8ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. రేఖ‌.. స‌చిన్ లు స‌భ‌కు హాజ‌రైన రోజుకు రూ.3.6ల‌క్ష‌లు.. రూ.2.56 ల‌క్ష‌ల చొప్పున ఖ‌ర్చు అయిన విష‌యాన్ని ఫ్యాక్ట్‌లీ సంస్థ వెల్ల‌డించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ ను చూస్తే.. పెద్ద‌లుగా చెప్పే వారిని పెద్ద‌ల స‌భ‌కు పంపితే.. దాన్నో షోకుగా మాత్ర‌మే త‌ప్పించి.. బాధ్య‌త‌గా భావించ‌ర‌ని. మ‌రి.. ప్ర‌జ‌ల ప‌ట్ల త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ను స‌రిగా నిర్వ‌ర్తించ‌ని వారికి.. అత్యున్న‌త పుర‌స్కారాలు ఇవ్వ‌టం స‌రైన‌దేనా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/