Begin typing your search above and press return to search.

చివరి దశలో మూడు రాజధానులు విచారణ ..ఆందోళనలతో వేడెక్కిన అమరావతి !

By:  Tupaki Desk   |   12 Dec 2020 5:40 AM GMT
చివరి దశలో మూడు రాజధానులు విచారణ ..ఆందోళనలతో వేడెక్కిన అమరావతి !
X
ఏపీలో మూడు రాజధానుల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల పై హైకోర్టు లో దాఖలైన వందకు పైగా పిటిషన్ల విచారణ చివరి దశకు చేరుకుంటోంది. అమరావతి స్ధానంలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజదానులు అవసరమా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు జరుపుతున్న విచారణలో ఇప్పటికే పిటిషనర్ల తరఫు వాదనలు పూర్తీ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం వాదనలు కొనసాగుతున్నాయి. ఇవి కూడా పూర్తయితే హైకోర్టు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో అమరావతి మరోసారి వేడెక్కుతోంది. అమరావతి అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలు, కేసులు, పోలీసుల కదలికలు, ఆంక్షలతో అమరావతి యుద్దభూమిని తలపిస్తుంది. సంక్రాంతిలోపు మిగతా పిటిషన్ల విచారణ కూడా కొలిక్కి వస్తందని భావిస్తన్నారు. దీంతో ఏడాది క్రితం వైసీపీ సర్కారు మూడు రాజదానుల ప్రకటన చేయగానే అమరావతిలో నెలకొన్న పరిస్ధితులే పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా అంతే వ్యూహాత్మకంగా సిద్ధం అవుతుంది.

అమరావతికి అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు వేర్వేరు శిబిరాలు కొనసాగుతుండటంతో వీరి మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో ఇరు శిబిరాలకు పోలీసులు భద్రత కల్పించాల్సి వస్తోంది. తాజాగా ఉద్దండరాయునిపాలెంలో అమరావతి అనుకూల శిబిరంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు, దీంతో నిరసనల్లో పాల్గొన్న వారికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అమరావతి రైతుల్లో మరింత ఆగ్రహాన్ని నింపింది. మరోవైపు అమరావతిలోని సీడ్‌ యాక్సిస్ రోడ్డు సమీపంలో దళిత బహుజన వర్గాల పేరుతో మూడు రాజధానులకు అనుకూలంగా మరో నిరసన సాగుతోంది. రాజధాని అనుకూల, వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో అమరావతిలో పోలీసుల ఆంక్షలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే దారుల్లో పోలీసుల నిఘాతో పాటు ఆంక్షలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వెళ్లే మార్గాలు కావడంతో వీటిలో పోలీసులు భారీగా మోహరించి అధికారిక, అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సచివాలయానికి వచ్చే సాధారణ ప్రజలు, ఉద్యోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా అమరావతి అనుకూల శిబిరంపై రాళ్ల దాడి తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.