Begin typing your search above and press return to search.

తెలంగాణా అధికారుల్లో టెన్షన్

By:  Tupaki Desk   |   29 April 2022 7:37 AM GMT
తెలంగాణా అధికారుల్లో టెన్షన్
X
కరోనా వైరస్ తీవ్రతకు సంబంధించి తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అధికారికంగా కరోనా వైరస్ కేసులను ప్రభుత్వమే ప్రకటించటం లేదు. ఈ విషయంలో హైకోర్టు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల వాస్తవ సంఖ్యపై నివేదిక ఇవ్వమని హైకోర్టు ఎన్నిసార్లు అడిగినా ఉపయోగం లేకపోయింది.

అలాంటిది తాజాగా పెరిగిపోతున్న కేసుల సంఖ్యపై అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 కేసులు నమోదవుతోంది. ఈ సంఖ్య జూన్ నాటికి 3వేల కేసులకు చేరుకునే అవకాశముందని అధికారులు ఆందోళన పడుతున్నారు. దీన్ని నాలుగోదశగా భావించవచ్చని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కరోనా వైరస్ తీవ్రతను పసిగట్టి ముందుగానే నియంత్రించే విషయంలో ఉన్నతాధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

ఢిల్లీ, మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరుగుతున్నట్లే తెలంగాణాలో కూడా మొదలైంది. అనేక రకాలుగా తెలంగాణా-మహారాష్ట్ర మధ్య సంబంధాలున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మీదుగా రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.

బహుశా ఈ జిల్లాల నుండే తెలంగాణా అంతా వైరస్ వ్యాపించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి అదనంగా ఓల్డ్ సిటీ నుండి కూడా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన పడుతున్నారు. గతంలో కూడా ఓల్డ్ సిటి నుండే ఎక్కువ కేసులు నమోదైన విషయాన్ని అధికారులు విశ్లేషిస్తున్నారు.

అందుకనే ముందు జాగ్రత్తగా తెలంగాణా వ్యాప్తంగా మళ్ళీ మాస్కులు ధరించటాన్ని కంపల్సరీ చేసే విషయమై ఉన్నతాధికారులు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మాస్కులు తప్పనిసరి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ముందుగా మేల్కొనకపోతే తెలంగాణ లో పరిస్ధితులు చేయిదాటిపోయినా ఆశ్చర్యంలేదని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారట. పైగా చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గతంలోలాగా ఇపుడు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వేయడం లేదు. బూస్టర్ డోసును ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయించుకోమని చాలా మందికి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. మరి పెరుగుతున్న కేసులను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాల్సిందే.