Begin typing your search above and press return to search.

కిర్లంపూడిలో క్షణం క్షణం టెన్షన్ టెన్షన్

By:  Tupaki Desk   |   25 July 2017 7:12 AM GMT
కిర్లంపూడిలో క్షణం క్షణం టెన్షన్ టెన్షన్
X
పాకిస్థాన్ తో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో సరిహద్దుల్లోని గ్రామాల్లో అలాంటి వాతావరణం కనిపించడం.. ఎటుచూసినా భద్రతా బలగాలే కనిపిస్తున్నాయి. ఇది సహజమైనదే.. కానీ, అక్కడ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఏ అంతర్జాతీయ సరిహద్దు కూడా లేని ఒక చిన్న గ్రామంలో కూడా ఇప్పుడు అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. వేల మంది పోలీసులు... ఊళ్లోకి ఎవరూ అడుగు పెట్టడానికి లేదు... ఆధార్ కార్డు చూపించకపోతే తీసుకెళ్లి జైళ్లో వేసేస్తారు. ఇద్దరు ముగ్గురు గుమిగూడితే చితక్కొట్టి పోలీసు జీపు ఎక్కిస్తున్నారు.. ఇల్లిళ్లూ సోదా చేస్తున్నారు... ఇంత భారీ ఎత్తున పోలీసు - భద్రత దళాల దిగ్బంధంలో చిక్కుకున్న ఆ గ్రామానికి ఎందుకా పరిస్థితి వచ్చింది.. అక్కడ ఎవరున్నారు? అంటే సమాధానం సింపుల్. అక్కడ ముద్రగడ పద్మనాభం ఉన్నారు. ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అదీ కథ... అందుకే ఆయన స్వగ్రామం కిర్లంపూడిని ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఇంతగా చుట్టుముట్టింది.

ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో వేలమంది పోలీసు బలగాల్ని మోహరించారు. గ్రామానికెళ్ళే అన్ని రహదార్లను దిగ్భంధనం చేసారు. ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే అటు వైపు అనుమతిస్తున్నారు. ఇంటి చిరునామా గల దృవీకరణ పత్రం చూపిన వార్ని మాత్రమే ఆ మార్గంలో వెళ్ళేందుకు వదులుతున్నారు. ముద్రగడ ఇంటి చుట్టూ సుమారు 250మంది పోలీసుల్ని కాపలా పెట్టారు. వీరితో పాటు నిఘా వర్గాలు కూడా అక్కడ మోహరించాయి. ఏ ఒక్కర్నీ ముద్రగడను కలిసేందుకు అనుమతించడంలేదు.

గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టేశారు. ఇంటింటికి తిరిగి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 140 మందికి నోటీసు లిచ్చారు. 86 మందిపై బైండోవర్‌ కేసు లెట్టారు. ఆదేశాల్ని ధిక్కరించి పాద యాత్రకు అడుగులేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం కిర్లంపూడి గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహిం చారు.

మరోవైపు కాపు నాయకులు కూడా అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు. యువకులు పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఒక అంచనా మేరకు బుధవారం సుమారు 2వేల మంది వివిధ గ్రామాల నుంచి ఒకేసారి రోడ్డెక్కి బయలుదేరనున్నారు. పోలీసు దెబ్బల్ని ఓర్చుకుని ముందుకెళ్ళడం ద్వారా కాపుజాతిలో నాయకులుగా మిగిలిపోవాలన్న ఆకాంక్ష ఇప్పటికే కాపు యువతలో వ్యక్తమౌతోంది. ఎవరినీ ఎటూ కదలకుండా చేస్తున్నా సెల్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణ - వ్యూహాలు అందరిక చేరుతున్నాయని... పాదయాత్రను అడ్డుకున్నా కూడా అడుగు ముందుకేసి తీరాలన్న నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.