Begin typing your search above and press return to search.

పార్టీల్లో మొదలైన టెన్షన్

By:  Tupaki Desk   |   18 April 2021 7:30 AM GMT
పార్టీల్లో మొదలైన టెన్షన్
X
అవును తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో నమోదైన ఓటింగ్ శాతంతో అన్నీ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఉపఎన్నికలో పోలింగ్ శాతం సుమారు 64 శాతంగా నమోదైంది. మొన్నటి ఎన్నికలో ఇదే నియోజకవర్గంలో నమోదైన ఓటింగ్ శాతం 80. అంటే అప్పటికి ఇప్పటికి 16 శాతం ఓటింగ్ పడిపోయింది. మరి పడిపోయిన ఓటింగ్ శాతం ఏ పార్టీపై పడుతుంది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు.

తగ్గిన ఓటింగ్ శాతంపై వైసీపీ, టీడీపీ నేతల్లో బాగా చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. ఓటింగ్ శాతం బాగా తగ్గిపోవటానికి రెండు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మొదటిదేమో మండిపోతున్న ఎండలు. రెండో కారణం ఏమో భయంకరంగా పెరిగిపోతున్న కరోనా వైరస్. ఈ రెండు కలిసి ఓటింగ్ శాతంపై దారుణమైన ప్రభావం చూపినట్లుగా రాజంపేట వైసీపీ ఎంపి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సరే వైసీపీ నేతల అంచనా ప్రకారం పోలింగ్ శాతం తగ్గినా తమకు వచ్చిన నష్టం ఏమీలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల మాదిరే ఇపుడు కూడా తమకు జనాల సానుకూలంగా స్పందించారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గడచిన రెండేళ్ళుగా అమలు చేస్తున్న సంక్షేమపథకాలే తమకు మంచి మెజారిటి తెస్తుందంటున్నారు. ఇపుడు జరిగిన 60 శాతంలో కూడా మెజారిటి ఓట్లు తమకే పోలయ్యాయనే అభిప్రాయనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీ నేతల వాదన ప్రకారం పోలింగ్ తగ్గిపోయిందంటే వైసీపీకి వేయటం ఇష్టంలేకే జనాలు పోలింగ్ లో పెద్దగా పాల్గొనలేదంటున్నారు. అయితే ఈ వాదన లాజిక్కుకు అందటంలేదు. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉంటే కచ్చితంగా పోలింగ్ కు వచ్చి 2019లో చూపించినట్లే ఓట్లరూపంలో తమ వ్యతిరేకతను తెలియజేసుండేవారే. దీనికితోడు ఉదయం నుండే దొంగఓట్లు పోలవుతున్నాయంటు చంద్రబాబునాయుడు అండ్ కో గోల మొదలుపెట్టేయటం కూడా పార్టీకి మైనస్ అయ్యింది.

దొంగఓట్లన్నది ఇఫుడే మొదలైంది కాదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా ఇదే పద్దతిలో ఉపఎన్నికలను మ్యానేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో చంద్రబాబు ఇంతకన్నా ఘోరంగానే మ్యానేజ్ చేసుకున్నారు. చంద్రబాబు అండ్ కో గోల చూసిన తర్వాత గెలుపుపై నమ్మకం పోవటం వల్లే టీడీపీ ఇంత గోల చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్ గమనార్హం. సరే బీజేపీ గురించి ఎవరు పెద్దగా చర్చించుకోవటం లేదు.