Begin typing your search above and press return to search.

‘కారు’ను భయపెడుతున్న ‘చపాతీరోల్’..

By:  Tupaki Desk   |   24 Oct 2021 3:30 AM GMT
‘కారు’ను భయపెడుతున్న ‘చపాతీరోల్’..
X
హుజూరాబాద్ ఉప ఎన్నిక రణ రంగాన్ని తలపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరికి మించి మరొకరు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో కనిపిస్తున్నారు. ఇండిపెండెంట్లతో సహా మొత్తం 30 మంది బరిలో ఉన్నారు. అయితే ఉచితంగా గుర్తులు వచ్చిన కొందరు ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలి ఉన్న గుర్తులు బాగానే ఉన్నాయి. ట్రక్కు, సైకిల్, చపాతీ రోల్ తదితర గుర్తులు అధికార పార్టీ నాయకులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చపాతీ రోల్ గుర్తు కారు వలె ఉండడంతో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందింది. బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు 1,079 ఓట్లతో గెలుపొందారు. అయితే టీఆర్ఎస్ ఓట్లు చీలిపోవడానికి చపాతీ రోల్ గుర్తు కారణమని కొందరు వాపోయారు. చాలా మంది గ్రామాల్లోని వారు కారు అనుకొని చపాతీరోల్ కు ఓటేశారని అంటున్నారు. ఎందుకంటే ఈ గుర్తుతో బరిలో ఉన్న అభ్యర్థికి 3,5 70 ఓట్లు వచ్చాయి. ఒకవేళ ఈ గుర్తు ఎన్నికల్లో లేకపోతే ఆ ఓట్లన్నీ కారుకే పడేవని ఉంటున్నారు. చపాతీ రోల్ అభ్యర్థి ఎవరికీ తెలియకపోయినా ఆయన నాలుగో స్థానంలోకి వచ్చారు. దీంతో చపాతీ రోల్ గుర్తుతో ‘కారు’నాయకులకు బెడద పుట్టింది.

మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయబడిన ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈటల రాజేందర్ ప్రభుత్వంపై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ నాయకులు సైతం ఈటల విమర్శలకు స్పందిస్తున్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే తిష్ట వేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళిత ఓట్లను ఆకట్టుకున్నారు.

ఈ తరుణంలో ఇన్నేళ్లు తమను పట్టించుకోలేదని, ఉప ఎన్నిక కారణంగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందని స్థానిక ప్రజలు అంటున్నా.. అధికార పార్టీకే మా మద్దతు అని కుల సంఘాలు, ఇతర నాయకులు ఇప్పటికే తీర్మాన పత్రాలు సైతం ఇస్తున్నారు. అయినా సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ కు అనుకూలంగా ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ ఎలాగైనా ఇక్కడ గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తీరిక లేకుండా నాయకులు ప్రచారం చేస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ కు మాత్రం గుర్తుల బెడద కారణంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో దుబ్బాకలో చపాతీ రోల్ విషయంలో తమ ఓట్లు కోల్పోయినందుకు ఈ గుర్తును తొలగించాలని ఈసీకి కంప్లెంట్ చేశారు. కానీ ఈసీ ఈ విషయంలో ఏ విధంగా స్పందించలేదు. మరోవైపు చపాతీ రోల్ తో పాటు ట్రక్కు సైతం కారును ప్రభావితం చేసే దిశగా ఉంది. అందువల్ల ఈ గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ నాయకలు ఈసీని కోరుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలో హుజూరాబాద్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈసారి హూజూరాబాద్లో ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ బరిలో ఉన్నారు. ఆయనకు ఈసీ ‘చపాతీ రోల్’ గుర్తును కేటాయించింది. అయితే ఈసారి చపాతీ రోల్ కారును ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.