Begin typing your search above and press return to search.

రామతీర్థంలో టెన్షన్: అశోక్ గజపతిరాజు నెట్టివేత.. వివాదంగా ప్రోటోకాల్

By:  Tupaki Desk   |   22 Dec 2021 7:08 AM GMT
రామతీర్థంలో టెన్షన్: అశోక్ గజపతిరాజు నెట్టివేత.. వివాదంగా ప్రోటోకాల్
X
విజయనగరం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రామతీర్థం కోదండరామాలయం పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన వివాదంగా మారింది. అప్పట్లో రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం వివాదం తర్వాత.. ఏపీ ప్రభుత్వం ఈ ఆలయ పునర్ నిర్మాణానికి సిద్ధమైంది. 10 గంటల 8 నిమిషాలకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీనికి శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మిక వ్యవహారంగా సాగాల్సిన ఈ శంకుస్థాపన రాజకీయ వివాదంగా మళ్లీ మొదలైంది.

మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక గజపతి రాజే ఈ ఆలయ కమిటీకి చైర్మన్. అయితే ఆనవాయితీ ఫాలో అవ్వడం లేదని.. సంప్రదాయాలను పక్కనపెట్టారని.. జరగాల్సిన మర్యాదలు లేవని అశోక్ గజపతి ఆగ్రహించారు. అక్కడున్న బోర్డును పీకేసే ప్రయత్నం చేశారు. దీంతో మరో వర్గం రివర్స్ అయ్యింది. ఆయన్ను అడ్డుకుంది.

అశోక్ గజపతిని ఉన్న ఫళంగా పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు అక్కడి కొందరు వ్యక్తులు.. అశోక్ గజపతి లేవనెత్తిన ప్రొటోకాల్ టాపిక్ తో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తత మధ్యే రామతీర్థంలో ఆలయానికి శంకుస్థాపన పూర్తి చేశారు.

రూ.3 కోట్ల నిధులతో రామతీర్థం ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. 6 నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పూర్తి రాతికట్టడంతో ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణ జరుగనుంది. ఆలయంతోపాటు ధ్వజస్తంభం, వంటశాల, మెట్ల మార్గం, కోనేరు అభివృద్ధి చేస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ 28న రాముడి విగ్రహం ధ్వంసం తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ట ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ప్రధాన ఆలయ ప్రాంగణంలో నూతన విగ్రహ ప్రతిష్ట జరిపి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.