Begin typing your search above and press return to search.

ఇబ్రహీంపూర్ లో అచ్చం సినిమాలో మాదిరే

By:  Tupaki Desk   |   9 Jan 2016 4:07 AM GMT
ఇబ్రహీంపూర్ లో అచ్చం సినిమాలో మాదిరే
X
దాదాపు 18 ఏళ్ల క్రితం డాక్టర్ రాజశేఖర్ హీరోగా ‘సూర్యుడు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలోని కొన్ని ఘటనలు మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకున్నాయి. సదరు సినిమాలో హీరో ఓ మండలాధ్యక్షుడు. అతనంటే ఆ ఊరి ప్రజలు ప్రాణాలు ఇస్తారు. మంచితనానికి మారుపేరుగా ఉండే అతగాడు.. ఒకసారి వేరే ఊరికి వెళతాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి అపార్థంతో అతన్ని..ఆ ఊరి నేతలు ఇద్దరు కలిసి కొడతారు. హీరోను కొట్టిన విషయం అతని అనుచరుడు (అలీ) తట్టుకోలేక గ్రామస్థులకు చెప్పటం.. రాత్రికి రాత్రే ఆ ఊరి వాళ్లంతా తమ ఊరి నాయకుడ్ని కొట్టిన ఊరిని తగలబెట్టేస్తారు. దారుణంగా వ్యవహరిస్తారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో.. తనకు బతికి ఉండగానే ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూల్చేసుకుంటాడు. విగ్రహం కూల్చేసుకోవటం లాంటివి లేకున్నా.. ఈ సినిమాలో మాదిరి చిన్న అపార్థం ఎంత చిచ్చు రేపిందో.. అచ్చు అలాంటి పరిస్థితే మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చాలా చిన్న విషయంలో చోటు చేసుకున్న చిన్న వివాదం ఒక నిండు ప్రాణం బలి కాగా.. పెద్ద ఎత్తున గొడవలకు.. కోట్లాటకు కారణంగా మారి రెండు జిల్లాల (మెదక్.. కరీంనగర్) మధ్య శాంతిభద్రతల సమస్యగా మారిన దుస్థితి. దాదాపు 8 గంటల పాటు భయానక పరిస్థితిని సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

మెదక్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ కు కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీరాం శ్రీహరి వెళ్లారు. అతని బైక్ మీదున్న బీడీల గంప కారణంగా ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుంభాల లక్ష్మీ చీర తగిలి.. కొంగు చిరిగింది. ఇంటికి వెళ్లిన ఆమె.. తనకు ఎదురైన పరిస్థితి ఇంట్లో చెప్పుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె కొడుకులు ఎల్లారెడ్డి.. నగేశ్ రెడ్డిలు ఆవేశంగా ఊరి చివర ఆగి ఉన్న శ్రీహరిని నిలదీశారు.

దాంతో తనకేమాత్రం సంబంధం లేదని చెప్పే క్రమంలో వారి మధ్య వాదన మొదలైంది. మాటా మాటా పెరిగింది. సర్పంచ్ తనయులు.. శ్రీహరిని తీవ్రంగా కొట్టి గదిలో బంధించారు. తన పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు శ్రీహరి ఫోన్లో వివరించాడు. దీంతో.. జిల్లెల్ల.. సిరిసిల్ల నుంచి కొంతమంది ఇబ్రహీంపూర్ వెళ్లారు. శ్రీహరిని ఎందుకు కొట్టారని ప్రశ్నించే లోపు.. సర్పంచ్ కుటుంబ సభ్యులు వారిని చితకబాదారు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న శ్రీహరి భార్య అరుణ.. జిల్లెల.. తెర్లుమద్ది సర్పంచ్ లు.. స్నేహితులు ఇబ్రహీంపూర్ చేరుకున్నారు.

తీవ్రంగా గాయాల పాలైన శ్రీహరిని కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీహరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీహరి మరణించాడు. దీంతో.. అతని మరణానికి కారణమైన ఇబ్రహీంపూర్ సర్పంచ్.. ఆమె కుమారులేనంటూ శ్రీహరి శవాన్ని తీసుకొచ్చి.. ఇబ్రహీంపూర్ సర్పంచ్ ఇంటి ముందు ఎదుట తీసుకొచ్చారు. దాదాపు 400 మందికి పైగా మహిళలు ఆందోళన చేపట్టారు. దీంతోపరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్పంచ్ లక్ష్మిని నిలదీస్తూనే.. ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఇంట్లో సామాను కుప్పపోసి తగలబెట్టారు. సర్పంచ్ లక్ష్మిని వివస్త్ర చేసిన భౌతిక దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ తో పాటు ఆమె చిన్న కోడలు రేవతిలపైనా దాడి చేశారు.

ఈ క్రమంలో లక్ష్మి స్పృహ తప్పిపోగా.. చిన్నకోడలు రేవతి పక్కింట్లో తల దాచుకున్న పరిస్థితి. ఆందోళన చేస్తున్న వారిని స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. వారిపైనా ఆందోళనాకారులు దాడికి పాల్పడ్డారు. వారి ధాటికి తట్టుకోలేక వారు తప్పించుకున్నారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధిపైనా దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో సర్పంచ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో ఇల్లు ధ్వంసమైంది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారైంది. పరిస్థితి చేయి దాటటంతో సిద్దిపేట డివిజన్ కు చెందిన వివిధ స్టేషన్ల రిజర్వు పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళకారుల్ని అడ్డుకుంటూనే శ్రీహరి శవాన్ని ట్రాక్టర్ లో తరలించారు. ఈ క్రమంలో సీఐ.. ఎస్ ఐల మీదా దాడి జరిగింది. మరో వైపు సర్పంచ్ ఇల్లు పూర్తిగా కాలిపోయింది.

పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోవటం.. విషయం చాలా పెద్దది కావటంతో మెదక్.. కరీంనగర్ జిల్లాల ఎస్పీలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. రెండు జిల్లాల ఎస్పీలు.. ఓఎస్డీ.. సిద్దిపేట డీఎస్పీ.. సిద్దిపేట డివిజన్ పరిధిలోని 10 మంది సీఐలు.. 20 మంది ఎస్ఐలు.. భారీగా పోలీసులు మొహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 8 గంటల పాటు సాగిన ఈ ఘటనతో రెండు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక చిన్న ఘటన.. సంయమనం కోల్పోవటం ఇంత పెద్ద ఘటనగా మారి ఒక నిండు ప్రాణం బలికాగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టంతో పాటు శాంతిభద్రతల సమస్యగా మారిన దుస్థితి. ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ మొదలెట్టారు. ఈ మొత్తం ఉదంతాన్ని చూస్తే.. ‘‘సూర్యుడు’’ సినిమాలోని కొంత భాగం గుర్తుకు రాక మానదు.