Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ ముందుకెళ్లలేకపోతున్న ఎమ్మెల్యేలు..

By:  Tupaki Desk   |   5 Feb 2020 4:17 AM GMT
గులాబీ బాస్ ముందుకెళ్లలేకపోతున్న ఎమ్మెల్యేలు..
X
రెండోసారి గద్దెనెక్కాక కేసీఆర్ బలం, బలగం.. ఆధిపత్యం పెరిగింది. తెలంగాణలోనూ ఈ బక్కపలుచని మనిషి ఇప్పుడు అత్యంత బలవంతుడిగా మారిపోయాడనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లిన సంగతి తెల్సిందే. తెలంగాణలోని 120 మున్సిపాలిటీల్లో వందకు పైగా మున్సిపాలిటీలను గులాబీ పార్టీ హస్తగతం చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని బాధ్యతలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేకే అప్పగించారు. మంత్రులు, ఇతర నేతలు అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేల భుజస్కందాల మీద పెట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొటముపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉందని తేల్చిచెప్పారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపుగా క్వీన్ సీప్ చేసినంత పని చేసింది. అయితే కొన్నిచోట్ల టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయింది. ఇప్పుడే ఇదే ఆ ఎమ్మెల్యేకు గులాబీ ముళ్లులా గుచ్చుకుంటుంది.

* ఆ ఎమ్మల్యేల్లో మొదలైన టెన్షన్..
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో గులాబీ బాస్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రతిపక్షాలను ఏకీపాడేశారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అలవోకగా గెలువాల్సి ఉండగా ఎక్స్ ఆఫీషియో ఓట్లు వేస్తే తప్ప కొన్ని చోట్ల గట్టెక్కలేదు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ బలహీనంగా ఉందని నివేదికలు రాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని పిలిచి ఆ స్థానాల్లో దృష్టి సారించాలని సూచించారు. అయితే ఆ స్థానాల్లో టీఆర్ఎస్ ఒడిపోవడంపై గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి ఎప్పుడు తామను పిలిచి క్లాస్ పీకుతారేమోనని ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులు భయాందోళన చెందుతున్నారట.. ముఖ్యమంత్రిని కలిసే సాహసం కూడా చేయడం లేదట.. దీంతో తమ నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎలా సాధించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం.

* 29చోట్ల మిశ్రమ ఫలితాలు..
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఛైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. అయితే టీఆర్ఎస్ కు 29చోట్ల అనుకున్నంత స్థాయి లో ఫలితాలు రాలేదు. ఇందులో మహేశ్వరం ఎమ్మెల్యే కం మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి సింగిల్ గా గెలువలేదు. ఎక్స్ ఆఫీషియో ఓట్లతోనే గట్టెక్కాల్సి వచ్చింది. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపాలిటీలోనూ ఎక్స్ ఆఫీషియో ఓట్లతోనే టీఆర్ఎస్ ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేటలోనూ ఇదే తంతు కొనసాగింది. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జైపాల్ యాదవ్, పైళ్ల శేఖర్ రెడ్డి, గణేష్ బిగాల, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రేఖానాయక్, గొంగిడి సునీత, సైదిరెడ్డి, అబ్రహం, హర్షవర్దన్ రెడ్డి, కోరుకంటి చందర్ తోపాటు మొత్తం 29మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాన్ని సాధించలేక పోయింది. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముఖ్యమంత్రి కి ఈ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఎదురు పడాల్సి ఉంటుంది. దీంతో ఆయా ఎమ్మెల్యేలు ఓటమిపై ఏ కారణం చెప్పాలని మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కి నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో ఓటమికి పార్టీలోని కొందరు సహకరించకపోవడం, గ్రూపు తగాదాల వల్లనే అనుకున్న ఫలితాలు రాలేదని ఎమ్మెల్యే ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే వీటిపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆయా ఎమ్మెల్యేలు భయాందోళన మొదలైంది. విశ్వాసనీయ సమాచారం ప్రకారం కొందరు ఎమ్మెల్యేలకు పనిష్మెంట్ తప్పదని తెలుస్తోంది.