Begin typing your search above and press return to search.

చేరికలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో కలవరం

By:  Tupaki Desk   |   11 March 2020 9:50 AM GMT
చేరికలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో కలవరం
X
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడ్ గా జరిగేటట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి కన్నా ప్రస్తుతం జగన్ అవలంభిస్తున్న రాజకీయ వ్యూహాలతో టీడీపీ కుదేలవుతోంది. సాధారణ ఎన్నికల కన్నా స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. గంపగుత్తగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశం.. టీడీపీని కనుమరుగు చేయాలనే లక్ష్యంతో తాజాగా పార్టీ కార్యాలయం ద్వారాలు తెరిచాడు. ఎవరైనా పార్టీలోకి రావొచ్చు అంటూ ముఖ్యంగా టీడీపీ నాయకులకు ఆహ్వానం అంటూ డోర్లు తెరిచారు. దీంతో పెద్ద సంఖ్యలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి నాయకులు వస్తున్నారు. అయితే ఈ పరిణామంతో వైఎస్సార్సీపీలో ఇప్పటికే నాయకులుగా ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. తమ ఉనికి ప్రశ్నార్థకం గా మారుతుందా అని భయాందోళనకు గురవుతున్నారు.

స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను 20 రోజుల్లోపే పూర్తి చేయాలని చెప్పి ఆ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకటన వెలువడిన రోజు నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీడీపీ నాయకులను పిలిచి మరి తమ జెండా కప్పేస్తున్నారు. అందుకే టీడీపీ నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఈ చేరికలను స్వాగతించారు. దీంతో రాష్ట్రంలో 11 జిల్లాల్లో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల నుంచి కూడా వలసలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రత్యర్థులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు తాజాగా పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల సమయంలో హోరాహోరీగా తలపడిన వారిని ఇప్పుడు పార్టీలోకి చేర్చుకోవడం తో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలు కలవరం చెందుతున్నారు. చేరికలకు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.. వస్తామంటే రండి.. అంటూ ఆహ్వానిస్తుండడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు చిక్కు వచ్చి పడింది.

ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న తాము ఇప్పుడు ఎలా కలిసి పని చేసేది అని ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. ఉప్పునిప్పుగా ఉన్న తాము ఒక్కసారిగా కలిసి పని చేయాలంటే కష్టమేనని పేర్కొంటున్నారు. తీవ్ర అభిప్రాయ బేధాలున్న వారు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడంతో ఎలా పని చేస్తారోనని ఆసక్తి నెలకొంది. వారి రాకతో తమకు ఏమైనా ముప్పు ఏర్పడుతుందని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో భయాందోళన కలుగుతోంది. వైఎస్ జగన్ ఏం చేయమంటే అది చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు సక్రమంగా పని చేయకుంటే ఇప్పుడు చేరిన వారికి పెత్తనం ఇస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ చేరికలు పార్టీని ముంచెలాగ ఉన్నాయని పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు. మరి భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో వేచి చూడాలి.