Begin typing your search above and press return to search.

ఉగ్రదాడితో పారిస్ హాహాకారాలు చేస్తోంది

By:  Tupaki Desk   |   14 Nov 2015 4:08 AM GMT
ఉగ్రదాడితో పారిస్ హాహాకారాలు చేస్తోంది
X
నిత్యం ప్రపంచానికి ఫ్యాషన్ పరిచయం చేసే పారిస్ ఇప్పుడు ఉగ్రదాడితో భీతిల్లిపోతోంది. ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత ఘోరకలిగా భావిస్తున్న ఈ ఉగ్రదాడితో పారిస్ భయం గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఎక్కడేం జరుగుతుందో అర్థం కాక.. పారిస్ పౌరులు హాహాకారాలు చేసే పరిస్థితి. అత్యంత దారుణమైన దాడిగా భావిస్తున్న ఈ ఉగ్రఘటనలో ఒకేచోట వందమందిని చేర్చి.. వారందరిని పేల్చేసినట్లు చెబుతున్నారు.

వరుసగా చోటు చేసుకున్న కాల్పులు.. దాడితో దాదాపు 140 మంది అమాయక పౌరులు మరణిస్తే.. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 150కు పెరిగినట్లుగా చెబుతున్నారు.

పారిస్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ఈ ఉగ్రదాడి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. పారిస్ నగరంలోని ఒక ఫుట్ బాల్ స్టేడియంతో పాటు.. థియేటర్.. రెస్టారెంట్.. పలు రద్దీ ప్రదేశాల్లో కొన్ని నిమిషాల తేడాతో దాడులు చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నా.. స్పష్టమైన ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు.

విచక్షణారహితంగా కాల్పులు జరపటం.. కొంతమంది పౌరుల్ని బందీలుగా చేసుకొని వారిని సామూహికంగా చంపేయటం లాంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో పారిస్ లో అత్యవసర పరిస్థితి విధించారంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సముద్రమార్గం నుంచి ముంబయి మహానగరంలో ముష్కరులు చేసిన దాడిని పోలినట్లుగా తాజా దాడి ఉందని చెప్పొచ్చు. వేర్వేరు గ్రూపులుగా విడిపోయిన ఉగ్రవాదులు.. విచక్షణారహితంగా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత.. టెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్లో విచక్షణారహితంగా కాల్పులతో ఈ మారణకాండ మొదలైందని చెప్పొచ్చు. ఆ వెంటనే.. జాతీయ ఫుట్ బాల్ స్టేడియం స్టేడ్ డీ ఫ్రాన్స్ బయట మూడు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లు జరిగే సమయంలో స్టేడియంలో ఫ్రాన్స్.. జర్మనీల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది.

పెద్ద శబ్ధంతో పేలుళ్లు చోటు చేసుకోవటంతో.. భద్రతా అధికారులు ఉలిక్కిపడి.. మొదట అధ్యక్షుడ్ని సురక్షిత ప్రాంతానికి తరలించి.. ప్రేక్షకుల్ని ఎమర్జెన్సీ ద్వారాల నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాటలో భారీగా గాయాలు అయినట్లు తెలుస్తోంది.

లెవెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఒక థియేటర్లో.. సెంట్రల్ ఫ్రాన్స్ లోని బటాక్లాన్ కాన్సెర్ట్ హాలులో.. ఒక రెస్టారెంట్లో.. ఇలా ఒకటి తర్వాత.. మరొకటిగా ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. ఈ దారుణ ఘటనలకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకూ ప్రకటించుకోలేదు.