Begin typing your search above and press return to search.

భార‌తీయ బిన్‌ లాడెన్ అరెస్ట్‌..న‌గ‌రంతో లింక్‌

By:  Tupaki Desk   |   23 Jan 2018 12:09 PM GMT
భార‌తీయ బిన్‌ లాడెన్ అరెస్ట్‌..న‌గ‌రంతో లింక్‌
X
భారతీయ బిన్‌ లాడెన్‌ గా పేరుమోసిన మోస్ట్‌ వాంటెండ్ టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. 2008 గుజరాత్ వరుస పేలుళ్ల సూత్రధారి - కరడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషీ (46) పదేళ్ల‌ తర్వాత పట్టుబడ్డాడు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో స్వల్ప ఎదురుకాల్పుల అనంతరం ఖురేషీని ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన ఉగ్రవాది - ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు - నిషేధిత ఇండియన్ ఇస్లామిక్ విద్యార్థి సంస్థ(సిమి) నాయకుడు అబ్దుల్ సుభాన్ ఖురేషీకి హైదరాబాద్‌ తో కూడా సంబంధాలున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌ లో ఖురేషీని అరెస్టు చేసినట్టు పోలీస్ ప్రత్యేక విభాగం డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుష్‌ వాహ మీడియాకు చెప్పారు. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు - నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి)తో సంబంధాలు కలిగి ఉన్న‌ట్లు వివరించారు. ఘాజీపూర్‌ లో తన స్నేహితుడిని ఖురేషీ కలిసేందుకు వస్తున్నట్టు అందిన సమాచారం మేరకు అతడిని మాటువేసి పట్టుకున్నట్టు తెలిపారు.

2008 జూలై 26న గుజరాత్‌ లోని అహ్మదాబాద్ నగరంలో వరుసగా పేలుళ్లు జరుగడంతో 20 మంది చనిపోగా - 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని నాడు ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించింది. నాటి నుంచి గూఢచార సంస్థలు - ప్రత్యేక పోలీసు బృందాలు ఖురేషీ కోసం అన్వేషిస్తున్నాయి. వేషాలు మారుస్తూ అనేకసార్లు పోలీసుల నుంచి ఖురేషీ తప్పించుకున్నాడు. పేలుళ్ల అనంతరం ఖురేషీ నేపాల్ పారిపోయి నకిలీ గుర్తింపుతో జీవనం సాగించాడని, 2015-17 మధ్య సౌదీ అరేబియాకు వెళ్లాడని కుష్‌ వాహ పేర్కొన్నారు. సిమి మ్యాగజైన్‌ కు ఖురేషీ ఎడిటర్‌ గా పనిచేశాడని చెప్పారు. ముంబై - బెంగళూరు - ఢిల్లీ వరుస పేలుళ్లలోనూ ఖురేషీ నిందితుడని ఆయన వెల్లడించారు. ఖురేషి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వలస వచ్చారు. తొలుత సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌ గా పలు కంపెనీల్లో పనిచేసిన ఖురేషీ - ఉగ్రవాద సంస్థ ఏర్పాటు అనంతరం బాంబుల తయారీలో దిట్టగా మారాడు. 2007లో వారణాసి పేలుళ్ల తర్వాత కేసులు నమోదైతే సిమి తరఫున ఆ కేసులు వాదించేందుకు అక్కడి న్యాయవాదులు ముందుకు రాలేదని, ఆ నేపథ్యంలో ఖురేషీ దక్షిణాది నగరాలపై దృష్టి సారించాడని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

2007-2008 ప్రాంతంలో ఖురేషీ బెంగళూరు - హైదరాబాద్‌ లలో ఉంటూ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేసినట్లు చెప్పారు. ఆ సమయంలోనే కేరళ - కర్ణాటక - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన పలువురు యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడని, పలువురిని ఐఎంలో రిక్రూట్ చేశాడని తెలిపారు. 2007లో హైదరాబాద్‌ లో జరిగిన పేలుళ్లతో ఖురేషీ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి. వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు సంబంధించి ఖురేషీపై 21 కేసులున్నట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఖురేషీ తరచూ పేర్లు మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కేసుల విచారణ కోసం ఖురేషీని ఇక్కడికి తీసుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.