Begin typing your search above and press return to search.

1993 ముంబై పేళుళ్ల కేసులో తీర్పు

By:  Tupaki Desk   |   16 Jun 2017 9:03 AM GMT
1993 ముంబై పేళుళ్ల కేసులో తీర్పు
X
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ప్ర‌త్యేక టాడా కోర్టు తీర్పును వెలువరిచింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన‌ ఈ కేసులో అబు సలెం - ముస్తాఫా దోసా సహా ఏడుగురిని దోషులుగా నిర్ధారించింది. కుట్ర ఆరోపణలు - హత్య - ఉగ్ర కార్యకలాపాల తదితర నేరాల కింద వీరిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వీరికి శిక్షను ఖరారు చేయాల్సి వుంది.

1993లో దేశ ఆర్థిక రాజ‌ధానిలో వరుస పేలుళ్లు జరిగాయి. సుమారు రెండు గంటల వ్యవధిలోనే 12చోట్ల బాంబు పేలుళ్లు జరగడంతో ముంబై నగరం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 713మందికి పైగా గాయపడ్డారు. సుమారు రూ.27 కోట్ల రూపాయ‌ల ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

ఈ ఘటనలో 2007లో టాడా కోర్టు తొలి దశ విచారణను పూర్తి చేసింది. అందులో 100మందిని నిందితులుగా గుర్తించగా.. మరో 23 మందిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే ఈ ట్రయల్‌ పూర్తయిన తర్వాత ఈ కేసులో అబు సలెం - ముస్తాఫా దోసా - కరిముల్లా ఖాన్‌ - ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌ - రియాజ్‌ సిద్ధిఖీ - తాహిర్‌ మర్చంట్‌ - అబ్దుల్‌ ఖయ్యుంలను కీలకమైన నిందితులుగా గుర్తించి వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పేలుళ్ల కేసులో మళ్లీ రెండో దశ విచారణ చేపట్టారు.

గుజరాత్‌ నుంచి ముంబయికి ఆయుధాలు రవాణా చేసిన ఆరోపణలతో అబు సలెంను అరెస్టు చేశారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కు కూడా అబుసలెం ఆయుధాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.

మరో నిందితుడు ముస్తాఫాను ఆర్డీఎక్స్‌ పేలుళ్ల సూత్రధారిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. ఈ నిందితులపై 2007లో విచారణ ప్రారంభించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఆ తర్వాత 2012లో విచారణను పునరుద్ధరించారు. విచారణలో అబుసలెం సహా మరో ముగ్గురు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు యాకుబ్‌ మేనన్‌ కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. 2015 జులై 30న యాకుబ్‌ ను ఉరితీశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/