Begin typing your search above and press return to search.

ఆఫ్ఘన్ కు క్యూ కడుతున్న తీవ్రవాదులు

By:  Tupaki Desk   |   23 Aug 2021 5:39 AM GMT
ఆఫ్ఘన్ కు క్యూ కడుతున్న తీవ్రవాదులు
X
ఉన్నవారు సరిపోనట్లుగా బయట ప్రాంతాల నుండి తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ కు చేరుకుంటున్నారట. వారం రోజుల క్రితం దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దేశాన్ని స్వాధీనం చేసుకున్న మొదటి మూడు రోజులు తాలిబన్లకు ఎదురు లేకుండా పోయింది. అయితే తర్వాత నుంచి మహిళలు, పంజ్ షీర్ ప్రాంతంలోని తాలిబన్ వ్యతిరేక దళాలు ఎక్కడికక్కడ ఎదురుతిరుగుతున్నాయి. తాలిబన్ల అదుపులో ఉన్న నాలుగు జిల్లాలను వ్యతిరేక దళాలు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తానికి తాలిబన్లకు, తాలిబన్ వ్యతిరేక దళాలకు మధ్య ఓ విధంగా అంతర్యుద్ధం మొదలైనట్లే అనుకోవాలి. ఎందుకంటే బగ్లాన్ ప్రావిన్సు ప్రాంతంలో వ్యతిరేక దళాల సుమారు 11 మంది తాలిబన్లను కాల్చి చంపేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాలిబన్ల వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటుకు పంజ్ షీర్లే కీలకం. తాలిబన్ల దెబ్బకు పారిపోయిన పోలీసులు, మిలిటరీ దళాలు కూడా పంజ్ షీర్లతో చేతులు కలిపారు. ఈ విషయాన్ని తాలిబన్లు ముందుగానే ఊహించినట్లున్నారు.

అందుకనే అవసరమైతే తమ వ్యతిరేక దళాలతో పోరాటం చేయడానికి వీలుగా అదనపు మద్దతును కోరారు. తాలిబన్ల అగ్రనేతల పిలుపు మేరకు బంగ్లాదేశ్, పాకిస్ధాన్, చైనాలో తాలిబన్ల మద్దతుదారుల, సానుభూతిపరులు ఆఫ్ఘనిస్థాన్ కు చేరుకుంటున్నారని సమాచారం. భారత్ మీదుగా బంగ్లాదేశ్ నుంచి తాలిబన్ల మద్దతుదారులు ఆఫ్ఘన్ చేరుకుంటున్నారనే సమాచారన్ని బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది. దీంతో మన సైన్యాధికారులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలను అప్రమత్తం చేశారు.

ఇందులో భాగంగానే పాకిస్ధాన్, చైనా నుంచి ఇఫ్పటికే కొందరు తీవ్రవాదులు, వాళ్ళ నాయకులు ఆప్ఘన్ కు చేరుకున్నట్లు నిఘావర్గాలు సమాచారాన్ని అందించాయట. చైనా-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో చైనాలో వీగర్ అనే ముస్లింలున్నారు. వీరికి తాలిబన్లు బలమైన మద్దతుదారులు. ఇపుడు వారిలో కొందరు ఇప్పటికే తాలిబన్లతో చేతులు కలిపారట. మొత్తానికి తాలిబన్ల మద్దతుదారులు, వ్యతిరేకదళాలు రెండు ఆప్ఘనిస్ధాన్ కు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏ క్షణంలో ఏమవుతుందో అర్ధంకాక స్ధానికుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.