Begin typing your search above and press return to search.

కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు !

By:  Tupaki Desk   |   11 Oct 2021 9:50 AM GMT
కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు !
X
జమ్మూ కశ్మీర్‌ లోని బండిపోరా జిల్లా హజీన్ ప్రాంతంలో తుపాకుల మోత మళ్లీ స్థానికంగా కలకలం సృష్టించింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బండిపోరాలోని గుండ్ జహంగీర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌ కౌంటర్‌ లో భద్రతా దళాలతో పాటు, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. కాగా, లష్కరే తోయిబా శాఖ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'‌ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

అరెస్ట్ అయిన ఉగ్రవాదులను తారిఖ్ అహ్మద్ దార్, మహ్మద్ షఫీ దార్, ముదాసిర్ హసన్ లోన్, బిలాల్ అహ్ దార్ గా వెల్లడించారు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. మహ్మద్ షఫీ అనే పౌరుడిని చంపిన ఘటనలో వీరి ప్రమేయం ఉన్నట్లు భద్రతా దళాలు తేల్చాయి. అయితే, మరో ఉగ్రవాది పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే, హజిన్ ప్రాంతంలో అల్లర్లు సృష్టించే కుట్రలో భాగంగా ఈ హత్యకు పాల్పడినట్లు భద్రతా దళాలు తేల్చాయి.

ఇదిలాఉంటే.. కశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన మైనారిటీల హత్యలను, ఉగ్రవాదానికి మద్ధతుగా నిలుస్తున్న వారికి వ్యతిరేకంగా పలు ముస్లిం సంఘాల ప్రతినిథులు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇంకా ఎంతకాలం' అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. గత కొద్ది రోజులుగా కశ్మీర్‌లో సుమారు ఏడుగురు సాధారణ పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఇందులో మైనార్టీ వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు.