Begin typing your search above and press return to search.

ఈసారి ఉడిలోకి వచ్చారు..ఇలా తిప్పికొట్టింది!

By:  Tupaki Desk   |   21 Sep 2016 5:14 AM GMT
ఈసారి ఉడిలోకి వచ్చారు..ఇలా తిప్పికొట్టింది!
X
యురి దుర్ఘటన జరిగి రెండురోజులు అయ్యిందో లేదో.. పాకిస్థాన్ పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు పడుతున్నా కూడా మరోసారి తమ కుక్కతోక వంకర బుద్దిని భయపెట్టింది పాక్. యురిలో అంటే.. అప్పుడు సైన్యం నిద్రలో ఉంది కాబట్టి, ఆదమరిచిన సమయంలో దాడి కాబట్టి భారత సైన్యం కాస్త దెబ్బతింది. కానీ ఈసారి అలా కాదు. పాక్ చెంప చెళ్లుమనిపించింది. పిచ్చి కుక్కలు దాడిచేస్తే - దెబ్బమీద దెబ్బ కొట్టాలని భావిస్తే.. కాల్చి పారేయడమే తప్ప మరో మార్గం లేదని భారత ఆర్మీ పాక్ కు మరోసారి తనదైన శైలిలో చెప్పింది.

ఆదివారం జరిగిన యురి దాడి అనంతరం తాజాగా మంగళవారం ఉడీతోపాటు కొండ ప్రాంతమైన కుప్వారా (నౌగామ్) జిలాల్లో చొరబాట్లకు ప్రయత్నాలు జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం దాదాపు 15 మంది మిలిటెంట్లు పెద్దసంఖ్యలో ఆయుధాలతో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ఆటలు సాగనివ్వని భారత దళాలు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టాయి. ఇప్పటికే తోటి జవాన్లు అమరులయ్యారన్న బాధతో ఉన్న జవాన్లు - ఆబాధకు కసిని కూడా కలిపి చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ మేరకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 15 మంది మిలిటెంట్లు ఎల్వోసీ గుండా చొరబాటుకు యత్నించారని, వారిని భారత సైన్యం మట్టుబెట్టిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

అనధికారిక పాక్ సైన్యం (ఉగ్రవాదులు) పని అలా ఉంటే.. ఈసారి పాకిస్తాన్ అధికారిక సైన్యం సైతం సరిహద్దులో భారత ఔట్‌ పోస్టులపై ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. మంగళవారం మధ్యాహ్నం 1:10 - 1:30 గంటల సమయంలో ఎల్వోసీ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడిందని శ్రీనగర్‌ లోని ఆర్మీ కార్యాలయం తెలిపింది. ఉడి ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాట్ల నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ సైన్యం ఇలా కాల్పులు జరిపిందని - అయితే రెండు చోట్లా భారత బలగాలు వీటిని తిప్పికొట్టాయని ఆర్మీ వెల్లడించింది.