Begin typing your search above and press return to search.

ఉరీ ఘటనలో నిచ్చెన ల ఎపిసోడ్ బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   17 Oct 2016 4:33 AM GMT
ఉరీ ఘటనలో నిచ్చెన ల ఎపిసోడ్ బయటకొచ్చింది
X
పెద్ద ఎత్తున సైనికుల్ని కోల్పోయేలా చేసిన ఉరీ ఉగ్రఘటనకు సంబంధించిన ఓ కీలక సమాచారాన్ని భారత దర్యాప్తు అధికారులు గుర్తించారు. పాక్ వైపు నుంచి సరిహద్దులు దాటిన ఉగ్రవాదులు.. ఉరీ సైనిక శిబిరం మీద దాడి చేయటం.. పెద్ద ఎత్తున సైనికుల ప్రాణాల్ని తీయటం తెలిసిందే. భారత్.. పాక్ మధ్య విద్యుత్ తీగ ఉన్నప్పటికీ.. వాటిని ధ్వంసం చేయకుండా సరిహద్దు ఎలా దాటారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ అంశం మీద దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు అసలేం జరిగిందన్న విషయాన్ని గుర్తించారు. నియంత్రణ రేఖ వద్దనున్న విద్యుత్ తీగకు తగలకుండా భారత్ లోకి ప్రవేశించటం కష్టంగా మారిన వేళ.. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు ఉగ్రవాదులు మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా గుర్తించారు.

కశ్మీర్ లోని సలామాబాద్ నాలా సమీపంలో ఒక చోట విద్యుత్ కంచెకున్న కొద్దిపాటి స్థలంలో ఒక తీవ్రవాది చాకచక్యంగా భారత్ లోకి చొరబడటం.. విద్యుత్ తీగలకు తగలకుండా రెండు వైపులా నిచ్చెల్ని ఏర్పాటు చేయటం.. వాటి మీద నుంచి మరో ముగ్గురు తీవ్రవాదులు భారత్ లోకి అడుగు పెట్టినట్లుగా గుర్తించారు. ఈ నిచ్చెనల ప్రక్రియకు చాలానే గంటల సమయం పట్టిందని.. ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా.. ఉగ్రవాదులుఅక్కడికక్కడే మరణించి ఉండేవారని చెబుతున్నారు.

నిచ్చెనల సాయంతో భారత్ లోకి విజయవంతంగా అడుగుపెట్టిన ఉగ్రవాదులు.. వెనువెంటనే ఉరీ సైనిక శిబిరం మీద దాడి చేయలేదన్న విషయాన్ని గుర్తించారు. సమీప గ్రామాల్లో ఆశ్రయం పొందిన వారు.. ఉరీ సైనిక శిబిరం మీద పూర్తిస్థాయి అవగాహన పెంచుకున్నట్లుగా గుర్తించారు. గొహల్లన్.. జబ్ లా గ్రామాలకు చెందిన వారు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నియంత్రణ రేఖను దాటి వచ్చాక కొద్దిరోజులు ఉరీ సైనిక శిబిరాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే దాడులకు తెగబడిన వైనం బయటకు వచ్చింది. సైనిక శిబిరం లేఔట్ పై పూర్తిస్థాయి అవగాహన పొందిన ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా శిబిరం వంటింటికి తాళం పెట్టేయటమే కాదు.. సరుకులు నిల్వ చేసే గది బయట కూడా గొళ్లెం పెట్టేశారు. అంటే.. లోపల ఉన్న సైనికులు బయటకు వచ్చే అవకాశాల్నితగ్గించేసిన వారు.. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కారణంతోనే ప్రాణ నష్టం భారీగా జరిగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/