Begin typing your search above and press return to search.

ఐసిస్ 'పవర్' వెనుక అసలు కథ ఇదీ

By:  Tupaki Desk   |   21 Nov 2015 9:58 AM GMT
ఐసిస్ పవర్ వెనుక అసలు కథ ఇదీ
X
మతం మత్తు - మాదక ద్రవ్యం మత్తు రెండూ కలిపి తలకెక్కించుకుని మూర్ఖబలంతో ప్రపంచానికి సవాల్ విసురుతోంది ఐఎస్ ఐఎస్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ. ఆఫ్రికా - ఆసియా - అమెరికా - ఐరోపా... ఇలా అన్ని ఖండాల్లోనూ తన దారుణాలను కొనసాగిస్తున్న ఐసిస్ ఇటీవల కాలంలో మరింత పేట్రేగిపోతోంది. ఫ్రాన్స్ లో దాడులతో ప్రపంచ దేశాలు ఐసిస్ పై పోరుకు చేతులు కలుపుతున్నాయి. అయితే... ఐసిస్ స్థావరాలపై దాడులకు దేశాలన్నీ వైమానిక దాడుల మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఆకాశం నుంచి బాంబులు కురిపించడమే తప్ప నేలపై యుద్ధం చేయడానికే అగ్రరాజ్యాలే హడలిపోతున్నాయి. ఇరాక్ - సిరియాల మధ్య గట్టిగా లక్ష మంది కూడా లేని ఐసిస్ ఉగ్రవాదులను చూసి అన్ని దేశాలూ ఎందుకు జడుసుకుంటున్నాయి.. ఉగ్రవాదులు ఎందుకు అంత బలంగా మారుతున్నారు అంటే దానికి సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల శక్తి రహస్యం అంఫెటామైన్ అనే మాదకద్రవ్యమని చెబుతున్నారు. కార్యరంగంలోకి అడుగుపెట్టే ముందు అంఫెటామైన్ తీసుకుంటున్నారని... అది వారిని వెయ్యి రెట్ల బలవంతులుగా మార్చుతోందని అంటున్నారు.

అంఫెటామైన్ అనేది చిన్నచిన్న ట్యాబ్లెట్ల రూపంలో ఉంటుంది. ఇది మొత్తం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మనిషికి శ్రమను తెలియనివ్వదు. కండరాలకు బలాన్నిస్తుంది. చలి - ఎండ - గాయాల నొప్పులు వంటివన్నీ దీని ముందు బలాదూర్. అక్టోబర్ తర్వాత ఇరాక్ - సిరియాల్లో ఉష్ట్రోగ్రతలు 12 డిగ్రీల నుంచి 0 డిగ్రీల వరకు పడిపోతాయి. అంతటి చలిలోనూ 'ఈ మందు' రొమ్ము విరుచుకుని తిరగగలిగే శక్తినిస్తుంది. అంఫెటామైన్ను మొదట్లో ఊబకాయం - మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించేవారు. తరువాత తరువాత దీన్ని మత్తుమందులా ఉపయోగిస్తుండడంతో 1980ల తర్వాత పశ్చిమదేశాల్లో నిషేధించారు. అయితే.. ఉగ్రమూకలు ఇప్పుడు దీన్ని బాగా వినియోగిస్తున్నాయి. ఇటీవల ఫ్రాన్స్ దాడులు.. అంతకుముందు 9/11 దాడులకు ముందు ఉగ్రవాదులు అంఫెటామైసిన్ వాడినట్లు ఆధారాలు లభించాయి.

పైగా దీని తయారీ చాలా సులభమట. ఒక్కసారి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే 48 గంటల వరకు ఆకలి - నిద్ర - అలసట ఉండనే ఉండదని... ఏం చెయ్యడానికైనాసరే వెనకాడని ధైర్యం వస్తుందని రసాయన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... భద్రతాదళాలకు దొరికిపోయే ఉగ్రవాదులు వెంటనే ఈ టాబ్లెట్లు వేసుకుంటున్నారట. దీంతో వారిని ఎంతకొట్టినా ఏం కావడం లేదట. అందుకే ఉగ్రవాదులు దొరికినప్పుడు ఇప్పుడ వెంటనే వారిని ఏమీ అనడం లేదు.. 48 గంటల తరువాతే పని మొదలు పెడుతున్నారు. అప్పుడైతే వారికి నొప్పి తెలుస్తోంది.

ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు అంఫెటామైసిన్ ను విస్తారంగా ఉపయోగిస్తుండడంతో వారి శక్తి ముందు నిలవడానికి భద్రతాబలగాలు కూడా భయపడుతున్నాయి. అందుకే సిరియా - ఇరాక్ లలో వైమానిక దాడులకే పరిమితం అవుతున్నారు. మొత్తానికి ఈ ముష్కర మూకలు మతం - మాదకద్రవ్యం మత్తులతో ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్నారు.