Begin typing your search above and press return to search.

టెస్లా రికార్డ్‌.. ట్రిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్‌లో ఫ‌స్ట్ టైం ఎంట్రీ

By:  Tupaki Desk   |   26 Oct 2021 6:21 AM GMT
టెస్లా రికార్డ్‌.. ట్రిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్‌లో ఫ‌స్ట్ టైం ఎంట్రీ
X
ఎలన్ మ‌స్క్ నేతృత్వంలోని ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా.. సోమవారం రికార్డు సృష్టించింది. తొలిసారి ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్‌ను కైవ‌సం చేసుకుంది. ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరిన అమెరికా కంపెనీ ల్లో టెస్లా.. ఐదోది కావ‌డం విశేషం. ఈ జాబితాలో ఇప్ప‌టికే యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, అల్ఫాబెట్ లు ఉన్నాయి. తాజాగా జ‌రిగిన ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు రికార్డు స్థాయి గ‌రిష్ఠ విలువ ప‌లికాయి. 950 డాల‌ర్ల చొప్పున 9శాతానికి పైగా ట్రేడ‌య్యాయి.

అయితే.. ఇంతగా మార్కెట్‌లో బూమ్ రావ‌డానికి కార‌ణం.. అమ‌రికాలోనే రెంట‌ల్ కార్ కంపెనీ.. హెర్ట్జ్‌.. ల‌క్ష టెస్లా కార్ల‌ను ఆర్డ‌ర్ చేసింది. వీటి విలువ సుమారు 4.2 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంది. 2022 నాటికి మొత్తం ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల‌నే ర‌న్ చేయాల‌ని సంక‌ల్పించిన నేప‌థ్యంలో హెర్ట్జ్ ఈ ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

అదేస‌మ‌యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల చార్జింగ్‌కు సంబంధించి మౌలిక స‌దుపాయాల్లో టెస్లా.. అంత‌ర్జాతీయ స్థాయికి చేరింది. ఇక‌, న‌వంబ‌రు ప్రారంభం నాటికే.. టెస్లా మోడ‌ల్ 3కి చెందిన వాహ‌నాల‌ను రెంట్ ప్రాతిప‌దిక‌న వినియోగ‌దారుల కోసం.. హెర్ట్జ్ ఎయిర్‌పోర్టు, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనూ... అమెరికాలోని మేజ‌ర్ మార్కెట్స్‌ లోను.. అదేవిధంగా యూర‌ప్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేనున్నారు.

ఇక‌, హెర్ట్జ్ కూడా.. త‌మ‌కు సంబంధించిన లొకేష‌న్ల‌ లో వేల కొద్దీ.. చార్జ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నుంది. టెస్లా మోడ‌ల్ - 3 వినియోగ‌దారుల కోసం.. అమెరికా, యూర‌ప్ ల‌లో దాదాపు 3000 సూప‌ర్ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇదిలావుంటే.. దీనికి ముందు.. టెస్లా.. త‌న నాలుగు ర‌కాల వాహ‌నాల‌పైనా ధ‌ర‌ల‌ను భారీగా పెంచింది.

బేస్ మోడ‌ల్‌-3, మోడ‌ల్-Y ఎల‌క్ట్రిక‌ల్ వాహనాల ధ‌ర‌ల‌ను ఒక్కొక్క‌టి 2000 డాల‌ర్ల చొప్పున పెంచింది. దీంతో వాటి ధ‌ర‌లు.. 43,990 డాల‌ర్లు, 56990 డాల‌ర్లుగా న‌మోద‌య్యాయి. దీనికి అద‌నంగా.. మోడ‌ల్ -S, మోడ‌ల్‌-X వాహ‌నాల ధ‌ర 5000 డాలర్ల‌కు ఎక్కువ‌గా ప‌లుకుతోంది. దీంతో 94990, 104990 డాల‌ర్ల‌కు చేరిన‌ట్టు ప్ర‌ముఖ బిజినెస్ సైట్ ఎల‌క్ట్రిక్‌.కో పేర్కొంది.

గ‌త ఏడాది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాల‌ను గ‌మ‌నిస్తే.. దాదాపు 200 శాతం గ‌రిష్టాన్ని తాకింది. ప‌ర్యావ‌ర‌ణ హిత వాహ‌నాల త‌యారీని ప్రోత్స‌హిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆటో మొబైల్ రంగం కూడా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ క్ర‌మంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉత్ప‌త్తి మ‌రింత పెరుగుతుంద‌ని తెలుస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఆగ‌స్టులో అమెరికాకు చెందిన‌న మూడు ఆటో మొబైల్ వాహ‌నాల ఉత్ప‌త్తి దారులు.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీని..2030 నాటికి 40-50 శాతం పెంచుతామ‌ని ప్ర‌తిన బూన‌డం గ‌మ‌నార్హం.