Begin typing your search above and press return to search.

ఇస్రోకు ఎలన్ మ‌స్క్‌... అభినంద‌న‌లు

By:  Tupaki Desk   |   15 July 2021 3:09 PM GMT
ఇస్రోకు ఎలన్ మ‌స్క్‌... అభినంద‌న‌లు
X
భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ సంస్థ‌..ఇస్రోకు టెస్లా, స్పేస్ X సీఈవో ఎల‌న్ మ‌స్క్ అభినంద‌న‌లు తెలిపారు. భార‌త్‌ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గ‌గ‌న్ యాన్ మిష‌న్‌కు సంబంధించి ముఖ్య ప్ర‌యోగం విజ‌య‌వంతంగా నిర్వ‌హించినందుకు ఎల‌న్ ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు. బుధ‌వారం రాత్రి.. గ‌గ‌న్ యాన్ మిష‌న్‌కు సంబంధించి ఇస్రో ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

గ‌గ‌న్‌యాన్‌లో ముఖ్య‌మైన లిక్విడ్ ప్రొపెల్లెంట్ వికాస్ ఇంజ‌న్ హాట్ టెస్ట్‌ను విజ‌యవంతంగా పూర్తిచేసిన‌ట్టు ఇస్రో తెలిపింది. మాన‌వ స‌హిత GSLV MkIII వెహిక‌ల్ ద్వారా కోర్ ఎల్ 110 లిక్విడ్ స్టేజ్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఇస్రో పేర్కొంది. గ‌గ‌న్ యాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంజ‌న్ ప‌రీక్ష‌కు సంబంధించి ఇది అత్యంత కీల‌క‌మ‌ని వెల్ల‌డించింది.

దీనిపై స్పందించిన మ‌స్క్‌.. ఇస్రో ట్వీట్‌కు త‌న అభినంద‌న‌ల‌తో రీట్వీట్ చేశారు. దీనికి భార‌త ప‌తాకాన్ని జోడించారు. ఇస్రో సాధించిన రికార్డుల‌పై మ‌స్క్ స్పందించ‌డం ఇదే తొలిసారికాదు. 2017 , ఫిబ్ర‌వ‌రిలో ఇస్రో 104 ఉప గ్ర‌హాల‌ను ఒకే ర్యాకెట్ ద్వారా గ‌గ‌నంలోకి పంపింది. అప్ప‌ట్లోనూ ఇస్రో ప‌నితీరును మ‌స్క్ కొనియాడారు. ఇస్రో ప‌నితీరు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అంత‌రిక్షంపై మ‌క్కువ ఉన్న మ‌స్క్‌.. గ‌గ‌న యానానికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై త‌న కంపెనీ స్పేస్ X ద్వారా అనేక ప్ర‌యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా పున‌ర్వినియోగ రాకెట్ సాంకేతిక‌త‌పై ఆయ‌న ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. ఇక‌, భార‌త గ‌గ‌న్ యాన్ మిష‌న్ విష‌యానికి వ‌స్తే.. ఇస్రో కూడా దేశ పౌరుల‌ను అంత‌రిక్ష యాత్ర‌కు తీసుకువెళ్లేందుకు ఎంతో ఉత్సాహంతో ఉంది. ఈ క్ర‌మంలోనే మాన‌వ స‌హిత GSLV MkIII వెహిక‌ల్ ఇంజ‌న్ సామ‌ర్థ్య ప్ర‌యోగం, త‌దిత‌ర విషయాల‌పై చేసిన ప్ర‌యోగాలు విజ‌యవంతం కావడం గ‌మ‌నార్హం.