Begin typing your search above and press return to search.

చంద్రబాబు పరువుకు పెద్ద పరీక్షేనా ?

By:  Tupaki Desk   |   17 Oct 2021 5:09 AM GMT
చంద్రబాబు పరువుకు పెద్ద పరీక్షేనా ?
X
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడు ఆశ నెరవేరుతుందో చెప్పలేకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే కుప్పం మున్సిపల్ ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక చంద్రబాబు పరువుకే పెద్ద పరీక్షగా మారబోతోంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ ఎన్నికలతో పాటు కుప్పంకు వివిధ కారణాలతో ఎన్నిక జరగలేదు. అందుకని ప్రత్యేకంగా తొందరలోనే ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. గతంలోనే ఇటు వైసీపీ అటు టీడీపీ ఛైర్మన్ అభ్యర్ధులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీ తరపున డాక్టర్ సుధీర్ ను ఎంపిక చేయగా టీడీపీ త్రిలోక్ ను ప్రకటించింది. 25 వార్డులున్న మున్సిపాలిటిలో వార్డులకు కౌన్సిలర్లుగా రెండుపార్టీలు ఇంకా పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేదు. ఇందులో 10 వార్డులు మహిళలకు రిజర్వయ్యాయి. మొత్తంమీద వైసీపీ మంచి ఊపుమీదుంది. పంచాయితీ ఎన్నికల్లో అధికారపార్టీ మద్దతుదారులే గెలిచారు. అలాగే పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తాన్ని వైసీపీ స్వీప్ చేసేసింది.

ఈ నేపధ్యంలో తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలో కూడా గెలిచి వైసీపీ తన సత్తాను చాటాలని ఆరాటపడుతోంది. ఇదే సమయంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోయిన పార్టీ పరువును ఎలా తిరిగి సంపాదించుకోవాలా ? అని చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే మూడు రోజుల నియోజకవర్గం పర్యటనను పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోకి వచ్చినా నియోజకవర్గాన్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.

నియోజకవర్గంలో మొత్తం పెత్తనమంతా కొంతమంది నేతలపైనా, అధికారులపైనా వదిలేసిన ఫలితంగానే ఇపుడు చంద్రబాబు కష్టకాలం అనుభవిస్తున్నారు. గడచిన 30 ఏళ్ళుగా పార్టీకి మద్దతుగా నిలబడిన చాలామంది నేతలను చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన ఫలితాన్ని మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికలో ఎదుర్కొన్నారు. రేపటి మున్సిపల్ ఎన్నికలో కూడా టీడీపీ ఓడిపోతే పోయేది చంద్రబాబు పరువే తప్ప పార్టీది కాదని అందరికీ తెలిసిందే.

ఇన్ని ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన పార్టీకి చివరగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితమే వచ్చే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే పూర్తి బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదుంచారు జగన్. దానికి తగ్గట్లుగానే మంత్రి పెద్దిరెడ్డి కూడా చంద్రబాబు ఓడించే విషయమై నూరుశాతం కృషి చేస్తున్నారు. మొత్తానికి తొందరలో జరగబోయే కుప్పం మున్సిపల్ ఎన్నికలే చంద్రబాబు పరువుకు పెద్ద పరీక్షగా మారింది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.