Begin typing your search above and press return to search.

గవర్నర్ నోట వికేంద్రీకరణ మాట...మరిన్ని ట్విస్టులు... ?

By:  Tupaki Desk   |   7 March 2022 9:35 AM GMT
గవర్నర్ నోట వికేంద్రీకరణ  మాట...మరిన్ని ట్విస్టులు... ?
X
మొత్తానికి అందరూ ఊహించిందే జరిగింది. రాష్ట్ర గవర్నర్ నోట జగన్ సర్కార్ ఏదైతే బలంగా నమ్ముతుందో ఆ మాటలను చెప్పించింది. మిగిలిన విషయాలు, అభివృద్ధి వంటివి ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న మూడు రాజధానుల వివాదం విషయంలో బిగ్ ట్విస్ట్ ఇస్తూ అధికార వికేంద్రీకరణ తమ విధానమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోట వైసీపీ సర్కార్ చెప్పింది.

దాంతో వైసీపీ సర్కార్ అలోచనలు ఏంటి అన్నవి మరో మారు లోకానికి తెలిసాయి. దీనికి పూర్వ రంగం చూసుకుంటే హైకోర్టు తీర్పు ఒక వైపు ఉంది. అమరావతి ఏకైక రాజధానిగా చేయాలని ఆదేశిస్తూ తుది తీర్పు కొద్ది రోజుల క్రితమే వెలువడింది. ఈ తీర్పుని కచ్చితంగా వైసీపీ సర్కార్ అమలు చేయాలని కూడా పేర్కొంది.

దాంతో పాటు ఆరు నెలల వ్యవధిలోగా మాస్టర్ ప్లాన్ ని అమలు చేయాల‌ని ఎప్పటికపుడు పురోగతిని కూడా కోర్టుకు నివేదించాలని సూచించింది. ఇవన్నీ ఇలా ఉంటే అధికార పాలనా పరమైన వికేంద్రీకరణ తమ విధానమని ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వచ్చారు.

దానికి బలాన్ని ఇచ్చేలా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన బడ్జెట్ సమావేశాల ఆరంభ ప్రసంగంలో వికేంద్రీకరణతోనే అభివృద్ధి అని చెప్పడం విశేషం. దీంతో సర్కార్ మూడ్ కూడా మూడు నుంచి బయటకు రావడం లేదని అర్ధమైంది. అదే టైమ్ లో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని మొన్నటి దాకా వినిపించింది.

అయితే కోర్టు తీర్పుతో దాన్ని కాస్తా పక్కకు పెట్టారు అని అంతా భావించారు. కానీ ఇపుడు చూస్తే బిల్లు రూపంలో కాకపోయినా మరో విధానం ద్వారా అయినా ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తుందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. మొత్తానికి చూస్తే హైకోర్టు తీర్పు ఒక వైపు ఉంది. మరో వైపు ప్రభుత్వం కూడా మూడు రాజధానులే మా విధానమని గట్టిగానే అంటోంది.

మరి దీని మీద కధ ఎటు వైపుగా సాగుతుంది అన్న ఆసక్తి అయితే అంతటా ఉంది. ఈ నేపధ్యంలోనే గవర్నర్ స్పీచ్ మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఆ ఆసక్తిని పెంచేలాగానే ఇపుడు వికేంద్రీకరణ మాటను గవర్నర్ చెప్పారు. దాంతో మరిన్ని ట్విస్టులు కూడా ఫ్యూచర్ లో ఉంటాయని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.