Begin typing your search above and press return to search.

హోదాపై సినీ స్టార్లు ఎందుకు నోరిప్ప‌డం లేదంటే...?

By:  Tupaki Desk   |   22 March 2018 3:30 PM GMT
హోదాపై సినీ స్టార్లు ఎందుకు నోరిప్ప‌డం లేదంటే...?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్య‌మం న‌డుస్తోంది. ఉద్య‌మం అనే కంటే కూడా ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంద‌ని చెప్పాలి. హోదా రాజ‌కీయంతోనే అప్ప‌టిదాకా కాస్తంత బ‌లంగానే క‌నిపించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ట్లుగా సంకేతాలు వెలువ‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మికి ఎదురే లేద‌న్న భావ‌న నుంచి... హోదా పోరు ఫ‌లితంగా 2019లో మోదీకి క‌ష్ట‌మేన‌న్న సంకేతాలు స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. మోదీ ప‌రిస్థితిని ప‌క్క‌న‌పెడితే.... ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ఏపీకి చెందిన అన్ని రాజ‌కీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఇక ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీకి ముద్ర‌ప‌డిన నేప‌థ్యంలో ఆ పార్టీకి చెందిన బీజేపీ నేత‌లు మాత్ర‌మే ఇప్పుడు హోదాపై త‌మ‌దైన కొత్త వాద‌న వినిపిస్తున్నారు. మొత్తంగా అన్ని పార్టీలు ఆందోళ‌న బాట ప‌ట్ట‌గా... ఏపీకి చెందిన బీజేపీ నేత‌లు మాత్ర‌మే ఈ పోరాటానికి కాస్తంత దూరంగా ఉన్నార‌ని చెప్పాలి. ఇది మ‌న‌కు క‌నిపిస్తున్న చిత్రం. అయితే మొన్న‌టికి మొన్న టీడీపీ అధికార ప్ర‌తినిధి హోదాలో ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్ర‌సాద్ చేసిన కామెంట్ల‌తో ఇప్పుడు సినిమా ప్ర‌ముఖుల పాత్ర‌పైనా ప్ర‌స్తావ‌న తీసుకురాక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

హీరో శివాజీ, ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మిన‌హా మిగిలిన ఏ ఒక్క సినీ ప్ర‌ముఖుడు హోదా పోరుపై క‌నీసం నోరు కూడా విప్ప‌లేదు. హైద‌రాబాదులో ఉండే సినిమా వాళ్ల‌కు ఏపీతో బంధం లేదా? అంటే... అదేమీ లేదు. సినిమా వాళ్ల‌లో 90 శాతానికి పైగా ఏపీ నేప‌థ్య‌మున్న వారే. మ‌రి వారెందుకు నోరు విప్ప‌డం లేదు? హోదా కోసం ఎదుకు నిన‌దించ‌డం లేదు? అంటే... చాలా పెద్ద క‌థే వినిపిస్తోంది. ఈ క‌థ పూర్వ‌ప‌రాల్లోకి వెళితే... ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వంపై గ‌ళం విప్పిన త‌మిళ న‌టులు క‌మ‌ల్ హాస‌న్‌, యువ హీరో విశాల్‌ల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ దాడులు చేసింది. వారిద్ద‌రు మాత్ర‌మే ప‌న్ను ఎగ‌వేశారా? అంటే... ఎంతమాత్రం కాద‌నే చెప్పాలి. ప‌న్ను ఎగ‌వేత‌దారులు సినీ రంగంలోనూ చాలా మందే ఉన్నారు. మ‌రి వీరిద్ద‌రి ఇళ్ల‌ల్లోనే ఐటీ సోదాలు ఎందుకు జ‌రిగాయి? కేవ‌లం వీరు కేంద్రానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే... అదే ఐటీ దాడుల భ‌యంతోనే టాలీవుడ్ ప్ర‌ముఖులు హోదా పేరెత్తేందుకే జ‌డిసిపోతున్నార‌న్న మాట వినిపిస్తోంది. అయినా హోదా పోరులో పాలుపంచుకోవాల్సిన బాధ్య‌త టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు లేదా? అంటే... ఉంద‌నే చెప్పాలి.

ఎందుకంటే.. ద‌ర్శ‌కధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు, ప్ర‌ముఖ నిర్మాతలు సురేశ్ బాబు, కేఎస్ రామారావు, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను త‌దిత‌రులంతా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి అనుకూలంగా ఉన్నవారే. ప్రిన్స్ మ‌హేశ్ బాబు విష‌యానికి వ‌స్తే... ఆయ‌న బావ గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. అంతేకాదండోయ్‌... రాఘ‌వేంద్ర‌రావు లాంటి కొందరు టీడీపీ స‌ర్కారులో ప‌ద‌వులు పొందారు కూడా. మ‌రి ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే... ఆ పార్టీకి మ‌ద్దతుగా వీరంతా కూడా నోరు విప్పాలి క‌దా. మ‌రి ఎందుకు వారంతా నోరు విప్ప‌డం లేదంటే?... కేంద్రానికి వ్య‌తిరేకంగా ఎక్క‌డ నోరు విప్పితే... ఎక్క‌డ ఐటీ దాడులు జ‌రుగుతాయోన‌న్న భ‌యం వారిని వెంటాడుతోంద‌ట‌. క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించిన బాహుబ‌లి చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావే పెట్టుబ‌డి స‌మ‌కూర్చిపెట్టిన‌ట్టుగా స‌మాచారం. ఆ క్ర‌మంలో ఆ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌తో ద‌ర్శ‌కేంద్రుడు, ఆయ‌న స‌న్నిహితుల‌కు వంద‌లాది కోట్ల మేర లాభం వ‌చ్చింది. ఇప్పుడు ఈ లాభాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి హోదా నినాదం అందుకుంటే... ఐటీ దాడులు జ‌రగడం ఖాయ‌మేన‌న్న భ‌యం వారి నోళ్ల‌ను మూయిస్తోందట‌.