Begin typing your search above and press return to search.

టీజీ అయిల్ మ‌సాజ్‌ !... బాబు టిప్ ఇస్తారా?

By:  Tupaki Desk   |   7 Feb 2019 11:39 AM GMT
టీజీ అయిల్ మ‌సాజ్‌ !... బాబు టిప్ ఇస్తారా?
X
ఏపీలో ఎన్నిక‌లకు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ... టికెట్ల కోసం ఆయా నేత‌లు చేస్తున్న య‌త్నాలు మ‌రింత ముమ్మ‌ర య‌త్నాలుగా మారుతున్నాయి. ఇప్ప‌టికే టికెట్లు క‌న్ ఫార్మ్ చేసుకున్న‌ ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు కాస్తంత కూల్ గానే వ్య‌వ‌హారం న‌డుపుతోంటే... పార్టీ త‌ర‌ఫున కొన‌సాగుతున్న సిట్టింగ్ స‌భ్యుల‌ను కాద‌ని టికెట్ల‌ను ఎగుర‌వేసుకు పోవాల‌ని య‌త్నిస్తున్న నేత‌లు మాత్రం త‌మ‌దైన రీతిలో వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. ఈ త‌ర‌హా య‌త్నాలు చేస్తున్న వారిలో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ మంత్రి టీజీ వెంక‌టేశ్ పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంద‌ని చెప్పాలి. ఎంద‌కంటే... పారిశ్రామిక‌వేత్త‌గా ఆర్థిక విష‌యాల్లో చాలా బ‌లమైన వ్య‌క్తిగానే ముద్ర‌ప‌డిపోయిన టీజీ... త‌న‌కు ఏం కావాల‌నుకున్నా ఇట్టే సాధించేసుకుంటార‌నే పేరుంది. మొన్న రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకునే విష‌యంలోనూ టీజీ త‌న‌దైన శైలి మంత్రాంగాన్ని న‌డిపి వేరే నేత‌కు దాదాపుగా ఖ‌రారైపోయిన రాజ్య‌స‌భ సీటును రాత్రికి రాత్రే తెచ్చేసుకున్నారు. మ‌రి ఇప్పుడు త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్ ను ఆయ‌న క‌ర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాల‌ని దాదాపుగా నిర్ణ‌యించేసుకున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా చాలా య‌త్నాలే చేసిన టీజీ... త‌న కుమారుడికి టికెట్ ఖాయ‌మ‌నే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

అయినా గెలుపు అవ‌కాశాలు ఉన్న టీజీ ఫ్యామిలీకి టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబుకు కూడా ఇబ్బందేమీ లేదు. అయితే అక్క‌డ టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి... టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన టీజీ వెంక‌టేశ్ ను ఓడించారు. ఆ త‌ర్వాత బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు ప‌డిపోయిన ఎస్వీ... టీడీపీలోకి చేరిపోయారు. వైసీపీ త‌ర‌ఫున ద‌క్కిన అసెంబ్లీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌కున్నా... ఇప్పుడు ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేగానే కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని చంద్ర‌బాబు... క‌ర్నూలు అసెంబ్లీ టికెట్ ను టీజీ ఫ్యామిలీకి ఇస్తారా? అన్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌. అయితే ఇటీవ‌ల కర్నూలు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన నారా లోకేశ్... సిట్టింగ్ ల‌కే క‌ర్నూలు పార్ల‌మెంటు, అసెంబ్లీ సీట్లంటూ ఓ మాట అనేశారు. ఈ మాట‌పై నాడు టీజీ గ‌ట్టిగానే లేచారు. అయినా రాజ‌కీయాల గురించి లోకేశ్ కు ఏం తెలుసంటూ అధినేత కుమారుడిపైనే రంకెలు వేశారు. దీనిపై చంద్ర‌బాబు కూడా కిమ్మ‌న‌కుండా ఉండిపోయారు.

తాజాగా మ‌ళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగిన టీజీ... చంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకునే దిశ‌గా కొన్ని కామెంట్లు చేసి ప‌నిలో ప‌నిగా త‌న కుమారుడిని రంగంలోకి దించుతున్న‌ట్టుగా ప్ర‌క‌టించేశారు. అయినా టీజీ ఈ దిశ‌గా ఏమ‌న్నారంటే.. ఏపీకి న్యాయం చేస్తుంద‌నే ఉద్దేశ్యంతోనే బీజేపీతో జ‌ట్టు క‌ట్టాం. బీజేపీ మోసం చేయ‌డంతో ఆ పార్టీకి దూరం జ‌రిగాం. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఎప్పుడేం చేయాలో బాబుకు బాగానే తెలుసు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అవ‌కాశాలు ఉన్న‌వారికే చంద్ర‌బాబు టికెట్లు ఇస్తారు. క‌ర్నూలులో నా కుమారుడు భ‌ర‌త్ కే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌. ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా భ‌ర‌తే పోటీ చేస్తారు అంటూ త‌న‌దైన శైలిలో టీజీ చెప్పుకుపోయారు. అయినా ఈ త‌ర‌హా ఆయిల్ మ‌సాజ్ ల‌కు చంద్ర‌బాబు ప‌డిపోతారా? అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.