Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు, జ‌గ‌న్‌..ఓ నీతి సూత్రం

By:  Tupaki Desk   |   26 Sep 2015 4:29 PM GMT
చంద్ర‌బాబు, జ‌గ‌న్‌..ఓ నీతి సూత్రం
X
ఆంద్ర‌ప్ర‌దేశ్ అధికార ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ఊహించ‌ని సూచ‌న వ‌చ్చింది. అది కూడా సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత టీడీపీ నేత అయిన టీజీ వెంక‌టేశ్ నుంచి కావ‌డం ఆస‌క్తిక‌రం. రొటీన్‌ గా ఆ స‌ల‌హా ఏపీకి ప్ర‌త్యేక హోదా మీదే అయిన‌ప్ప‌టికీ....టీజీ సూచ‌న‌లు, ఆయ‌న మార్కు కామెంట్ లు మాత్రం ఇందులో ట్విస్ట్‌. ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశం ఏపీ ప్ర‌జ‌ల‌కు సంజీవ‌నిగా మారిన క్ర‌మంలో ఏపీ నాయ‌కులంతా ఉమ్మ‌డిగా పోరాడాల‌ని టీజీ వెంక‌టేశ్ అన్నారు. హోదా సాధ‌న‌లో కీల‌క వ్య‌క్తులు అయిన ఏపీ సీఎం చంద్రబాబు, ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్‌ కొట్టుకుంటే రాష్ట్రానికి మిగిలేది బూడిదేనని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు.

ప్రత్యేకహోదా కోసం అనవసర దీక్షలు మాని కేంద్రంపై పోరాటం చేయాలని ప్రతిపక్ష నేత జగన్‌ కు టీజీ వెంకటేష్ సూచించారు. జగన్‌ ప్రత్యేక హోదా సాధిస్తే మొదట సంతోషపడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అయిన అమరావతిని ఫ్రీజోన్‌ గా ప్రకటించాలన్నారు. వేసవి, శీతాకాల రాజధానులను సీమ‌లో ఏర్పాటు చేయాలని కోరారు. హంద్రీ నీవాతో సహా సీమలోని ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తిచేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో హైకోర్టు బెంచ్‌ లు ఏర్పాటు చేయాలని కోరారు. టీటీడీ ఉద్యోగాలన్నీ రాయలసీమ వాసులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలులో నిట్‌ - ఐఐటిలను ఏర్పాటుచేయాలని కోరారు. ఇలా ఏపీ గురించి త‌న ఆకాంక్షను వెల్ల‌డిస్తూనే...సీమ ప‌ట్ల ప్రత్యేక మ‌మ‌కారాన్ని వెంక‌టేశ్ మ‌రోమారు చాటుకున్నారు.