Begin typing your search above and press return to search.

అబ్బో.. టీజీ సినిమా మాటలు చెబుతున్నారే..

By:  Tupaki Desk   |   11 July 2016 7:14 AM GMT
అబ్బో.. టీజీ సినిమా మాటలు చెబుతున్నారే..
X
‘‘రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇప్పుడు ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. ఏపీ విడిపోతే.. ఏదో జరుగుతుందని భయపడ్డా.. అందుకే సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించా.. ఇప్పుడా భయాలన్నీ ఏమీ లేవు..’’ అంటూ మాటలు చెబుతున్న నేత ఎవరో తెలుసా? తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి.. ఉద్యమ సమయంలో మాటలు తూటాల్లా వదిలిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. రాజకీయ నాయకుడు.. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన టీడీపీ నేత టీజీ వెంకటేశ్. విభజన ఉద్యమం జోరుగా సాగినప్పుడు రాయలసీమ ప్రయోజనాల గురించి గళం విప్పిన టీజీ వెంకటేశ్.. సమైక్యవాదాన్ని బలంగా వినిపించేవారు.

కాకపోతే.. తెలంగాణ నేతలు వినిపించిన వాదనకు.. సూటి సమాధానాలు చెప్పకుండా అందరిని ఆకర్షించే ఘాటు వ్యాఖ్యలు చేసే టీజీ వెంకటేశ్ పై టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. టీజీ వెంకటేశ్ దిష్టిబొమ్మల్ని పదే పదే తగలబెట్టేవారు. సీమాంధ్రుల బ్రాండ్ అంబాసిడర్ గా టీజీని భావించేవారు. అంతదాకా ఎందుకు.. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలుత తెలంగాణ స్టేట్ ను ‘‘టీజీ’’గా వ్యవహరించేవారు. వాహనాలకు కూడా ‘‘టీజీ’’ అన్న పదమే ఉండాలని అధికారులు నిర్ణయించినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పదాన్ని వ్యతిరేకించి.. ‘‘టీఎస్’’గా మార్చటం మర్చిపోకూడదు. ఇదంతా టీజీ వెంకటేశ్ ఎఫెక్టే అనే వాళ్లూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వారి పేరును గుర్తుకు తెచ్చేలా ఉండటం ఏమిటన్న మాటను కేసీఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా చెబుతారు. కాకుంటే.. ఈ మాటకు ఫ్రూప్ దొరకటం కష్టం.

అలాంటి టీజీ వెంకటేశ్ ఇప్పుడు వెరైటీ మాటలు చెప్పటం గమనార్హం. విబజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎన్నిపంచాయితీలు ఉన్నాయో దినపత్రికల్ని చూస్తే ఇట్టే తెలుస్తుంది. తాజాగా టీజీ చెప్పిన మాటలు సీమాంద్రుల్ని అవమానించేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కేవలం భయంతో తాము సందేహపడి మాత్రమే విభజనను వ్యతిరేకించినట్లుగా టీజీ చెప్పటం సబబుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం గుర్తు లేనట్లుగా వ్యాఖ్యానిస్తున్న టీజీ తీరు సబబుగా లేదని చెబుతున్నారు.

తాను ప్రాతినిధ్యం వహించే వర్గం కరీంనగర్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టీజీ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. విభజన సమయంలో తన వర్గానికి చెందిన తెలంగాణ వారి మద్దతు కోల్పోయిన దాన్ని భర్తీ చేసుకునేందుకు ఇప్పుడిలా మాటలు మాట్లాడుతున్నారన్న చెబుతున్నారు. తెలంగాణ.. సమైక్యాంధ్ర ఉద్యమాలు సినిమా సీన్ల వంటివని.. వాటిని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదని.. రెండు రాష్ట్రాలూ ముందడుగువేస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఏమైనా పారిశ్రామికవేత్తలు ఉద్యమనాయకులుగా మారితే ఎలాంటి మాటలు వస్తాయనటానికి టీజీ వెంకటేశ్ తాజా మాటలు పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు.