Begin typing your search above and press return to search.

బాబుకు టీజీ ఝలక్ : భాజపాకు జై!

By:  Tupaki Desk   |   24 Feb 2018 11:38 AM GMT
బాబుకు టీజీ ఝలక్ : భాజపాకు జై!
X
కాంగ్రెస్ పార్టీనుంచి ఫిరాయించి వచ్చిన నాయకుడికి అప్పనంగా రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టినందుకు తాను ఎదుర్కొన్న విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంకా మరచిపోయి ఉండకపోవచ్చు. అప్పుడే.. టీజీ ఆయనకు చాలా ఘాటుగా ఝలక్ ఇచ్చారు. అసలే భాజపా పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే తరహా బంధాన్ని కొనసాగిస్తున్న సమయంలో.. ఆయన భాజపా డిమాండుకు అడ్డంగా జై కొట్టడం. అదేసమయంలో.. అదే డిమాండును తాను చాలాకాలంనుంచి వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని అనడం.. ఖచ్చితంగా బాబును ఇరుకున పెట్టే విషయాలే.

వివరాల్లోకి వెళితే..

తెదేపా- భాజపా మధ్య వాతావరణం ఇప్పుడు ఎలా ఉన్నదో అందరికీ తెలుసు. అసలు రాష్ట్రానికి రాజధానికి రావాల్సిన నిధులేమీ ఇవ్వకుండా కేంద్రం వంచిస్తున్నదని అందరూ అంటున్న సమయంలో భాజపా రాయలసీమ నాయకులు కర్నూలులో ఓ సమావేశం పెట్టుకుని రాయలసీమలో రెండో రాజధాని కావాలంటూ పెద్ద తీర్మానం చేశారు. ఒక రాజధానికే ఈ రాష్ట్రానికి దిక్కులేకపోతున్నదంటే.. రెండో రాజధానిని భాజపానే అడగడం చిత్రమైన విషయంగా ప్రజలే ఆగ్రహిస్తున్నారు. ఒకటో రాజధానికి కేంద్రాన్ని డబ్బు అడగలేని రాష్ట్ర భాజపా నాయకులు రెండో రాజధానిని ఏ మొహం పెట్టుకుని అడుగుతారని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. భాజపా డిమాండు సరైనదే అటూ తెదేపా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వెల్లడించడం చిత్రమైన పరిణామంగా కనిపిస్తోంది. రాయలసీమలో రెండో రాజధాని ఉండాలని తాను ఎంతో కాలంనుంచి కోరుతున్నానని ఆయన అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉంటూ తెలుగుదేశంలోకి వచ్చిన టీజీ వెంకటేష్ మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలో పడేస్తున్నాయి. రెండో రాజధాని గానీ, హైకోర్టు గానీ.. కేవలం భాజపా వారి డిమాండు మాత్రమే అయితే గనుక.. తెదేపా కూడా ఘాటుగా ప్రతిస్పందించే అవకాశం ఉండేది. ఇప్పుడు తెదేపా ఎంపీ కూడా దానికి మద్దతు ఇస్తుండడంతో వారు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు.