Begin typing your search above and press return to search.

జనాల మాటకు టీజీ ఆస్తులకు తేడా అంతనా?

By:  Tupaki Desk   |   1 Jun 2016 7:49 AM GMT
జనాల మాటకు టీజీ ఆస్తులకు తేడా అంతనా?
X
కర్నూలు జిల్లా మొత్తంలో ఎవరిని కదిలించినా కొంతమంది నేతల గురించి ఇట్టే చెప్పేస్తుంటారు. అలాంటి నేతల్లో ఒకరు టీజీ వెంకటేశ్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కర్నూలు జిల్లాలో మరే రాజకీయ నేతకు లేని ఒక విలక్షణత టీజీ వెంకటేశ్ సొంతం. అటు పారిశ్రామికవేత్తగా.. ఇటు రాజకీయ వేత్తగా టీజీ తరహాలో వ్యవహరించే నేత మరొకరు కనిపించరు. ఎస్పీవై రెడ్డి పారిశ్రామికవేత్త అయినప్పటికీ.. ఆయన తీరు భిన్నంగా ఉంటుంది. వ్యాపారం.. రాజకీయానికి ఆయన సమ ప్రాధాన్యత ఇస్తూ కనిపిస్తారు. కానీ.. టీజీ తరహా వేరు. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ గా కొందరు అభివర్ణిస్తారు.

తన చేతిలో పదవి లేనప్పుడు ఆయన దృష్టి మొత్తం వ్యాపారం మీదనే ఉంటుందని చెబుతారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలో ఏపీ తరఫున రాజకీయంగా ఆయన ఎన్నిసార్లు స్పందించారు? విపక్ష నేత జగన్ మీద ఎన్నిసార్లు మాటల దాడి చేశారో లెక్కలు తీస్తే టీజీ వెంకటేశ్ ఫుల్ టైం పొలిటీషియనా? పార్ట్ టైం పొలిటీషియనా? అన్నది తెలిసిపోతుంది.

అలాంటి ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకోవటం ఒక విశేషంగా చెప్పాలి. కారణాలు ఏవైనా టీజీ వెంకటేశ్ రానున్న రోజుల్లో రాజ్యసభ సభ్యుడు కావటం ఖాయమని తేలిపోయినట్లే. ఇదిలా ఉంటే.. తాజాగా తన నామినేషన్ సందర్భంగా టీజీ తన ఆస్తుల గురించి పేర్కొన్నారు. ఆయన తన పేరు మీద ఉన్న మొత్తం స్థిర.. చర ఆస్తులు కలిపి రూ.29.68 కోట్లుగా చెప్పారు. ఇక.. భార్యపేరు మీద రూ.42.5 కోట్ల స్థిరాస్తి.. రూ.17కోట్ల చరాస్తి ఉంది. ఇద్దరి మీదా చెరో ఆరేసి కోట్ల చొప్పున అప్పులున్నట్లుగా పేర్కొన్నారు.

ఈ ఫిగర్ ను చూసిన కర్నూలు జిల్లా వాసులు ముక్కున వేలేసుకునే పరిస్థితి. జిల్లా మొత్తాన్ని పక్కన పెడితే.. కర్నూలు నగరానికి సంబంధించినంత వరకూ చూస్తే.. టీజీ ఆస్తుల చిట్టా తెలిసిన వారంతా టీజీ ఆస్తుల విలువ మరీ ఇంత తక్కువా అన్న వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మార్కెట్ అంచనాల ప్రకారం.. టీజీ ఆస్తుల విలువ కనిష్ఠంగా రూ.200 కోట్లకు పైనే ఉంటాయని చెబుతారు. మరికొందరి మాటలు వింటే టీజీ ఆస్తి అంతా? అన్న ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం. కానీ.. అధికారిక లెక్కల ప్రకారం ఆయన తన పేరు మీదున్న ఆస్తుల విలువ తక్కువే చూపించారన్న మాట వినిపిస్తోంది. అయితే.. మార్కెట్ వాల్యూ కాకుండా.. ప్రభుత్వ విలువ ప్రకారం టీజీ ఆస్తుల వివరాలు వెల్లడించి ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. రాజ్యసభ నామినేషన్ వేసేటప్పుడు లెక్కలు జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటారా ఏంటి?