Begin typing your search above and press return to search.

క్రాస్ చెక్ : టీజీకి కీ ఇచ్చి మాట్లాడిస్తున్నారా?

By:  Tupaki Desk   |   2 Feb 2018 5:38 AM GMT
క్రాస్ చెక్ : టీజీకి కీ ఇచ్చి మాట్లాడిస్తున్నారా?
X
తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎంపీ నోరు విప్పి స్పష్టంగా ఒక వాదనను తెరమీదికి తీసుకువచ్చారు. కేంద్రం బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఏపీకి అన్యాయం చేసినంత మాత్రాన.. భాజపాతో తెగతెంపులు చేసుకునే ఉద్దేశం ఏదీ తమకు లేదని తేల్చిచెప్పారు. ఒకవైపు చంద్రబాబు నాయుడును విపరీతంగా కీర్తిస్తూనే.. అదే సమయంలో... భారతీయ జనతా పార్టీని ఒక రేంజిలో దుమ్మెత్తిపోశారు ఎంపీ టీజీ వెంకటేష్. జీఎస్టీ తెచ్చిన ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తంగా కూలిపోయాయంటూ శాపనార్ధాలు పెట్టారు. మరోవైపు గొడవ పెట్టుకుంటే చేతికి చిప్ప తప్పదని టీజీ హెచ్చరించారు.

మొత్తానికి తెలుగుదేశం పార్టీనుంచి స్పందనలు మొదలయ్యాయి. ఆదివారం నాడు ఎంపీలతో చంద్రబాబునాయుడు భేటీ కాబోతున్న తరుణంలో.. పార్టీ ఏమైనా సీరియస్ ప్రతికూల నిర్ణయం తీసుకుంటుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎంపీ టీజీ వెంకటేష్ తెగతెంపులు ఉండదు గానీ.. కేంద్రంతో అంచెలంచెలుగా వార్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆయన చెబుతున్న ప్రకారం.. కేంద్రంలోని ప్రభుత్వం నుంచి తొలిదశలో తెదేపా మంత్రులు రాజీనామాలు చేసి బయటకు వస్తారు. అప్పటికీ కేంద్రంలో స్పందన రాకపోతే గనుక.. తెలుగుదేశానికి చెందిన ఎంపీలందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేస్తారు. అప్పటికీ ఏమీ సానుకూలత రాకపోతే మాత్రమే.. ఫైనల్ ఎటెంప్ట్ కింద తెగతెంపుల గురించి ఆలోచిస్తారు. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం కేంద్రంతో వ్యవహరించాలని అని ఆయన అంటున్నారు.

చంద్రబాబునాయుడును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఒకప్పట్లో బాబు ఎలా చెబితే అలా కేంద్ర ప్రభుత్వాలు నడిచిన రోజులు ఉన్నాయని టీజీ గుర్తు చేశారు. ఆదివారం జరిగే భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని కూడా హింట్ ఇచ్చారు.

అయితే టీజీతో ఇలాంటి వాదనను .. పార్టీ పెద్దలే పనిగట్టుకుని ఇలా తెరమీదికి తెప్పించారా.. ఆయనకు కీ ఇచ్చి ఇలాంటి వాదనను మాట్లాడిస్తున్నారా? అని రాజకీయ వర్గాల్లో చర్చచ జరుగుతోంది. ఎందుకంటే.. తాను ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు దాని పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందోనని రకరకాల మార్గాల్లో తెలుసుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటు. ఆ అలవాటు ప్రకారం.. టీజీతో ఇలా మాట్లాడించి.. ఆ మాటల పట్ల ఎవరెలా స్పందిస్తారో.. ఏం చెబుతున్నారో .. సోషల్ మీడియాలో.. ప్రజల్లో ఆ వాదనపై చర్చ ఎలా జరుగుతుందో గమనించి.. దాన్ని బట్టి.. ఫైనల్ డెసిషన్ కు రావచ్చుననేది ఆయన వ్యూహం కావచ్చుననేది కొందరి భావన. మొత్తానికి తెదేపాలో భాజపాతో మైత్రికి వ్యతిరేకంగా చాలా సీరియస్ చర్చే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.