Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ చెబితే విన‌టానికి మేం పిల్ల‌లమా?టీజీ

By:  Tupaki Desk   |   3 Feb 2018 9:49 AM GMT
ప‌వ‌న్ చెబితే విన‌టానికి మేం పిల్ల‌లమా?టీజీ
X
నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టంలో ఏపీ రాజ‌కీయ నేత‌ల‌కు మించినోళ్లు మ‌రొక‌రు ఉండ‌రు. ఈ విష‌యంలో కొంద‌రి నోటిమాట ఎంత మాట ప‌డితే అంత‌న్న‌ట్లుగా ఉంటుంది. నిజానికి ఈ మాట‌ల కార‌ణంగానే విభ‌జ‌న విష‌యంలో ఏపీ చాలా న‌ష్ట‌పోయింద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తారు. గుప్పెడు మంది నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం.. ఆ మాట‌ల్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపించి వ్యూహాత్మ‌కంగా ఉద్య‌మ సెంటిమెంట్‌ను ర‌గిలించ‌టంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌న్న వాద‌న‌ను కొంద‌రు వినిపిస్తుంటారు.

ఆ కోణంలో చూసిన‌ప్పుడు వారి వాద‌న‌లో వాస్త‌వం ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. తాజాగా ఏపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ మాట‌లు ఇదే తీరులో సాగుతున్నాయ‌న్న భావ‌న క‌లిగిస్తోంది. ఓవైపు ప‌వ‌న్ తో దోస్తీ మీద ఆశ‌లు పెట్టుకున్న బాబుకు ఇబ్బంది క‌లిగించే రీతిలో ఆయ‌న విశ్వాస‌పాత్రుడు వ్య‌వ‌హ‌రిస్తున్న‌వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ మీద విమ‌ర్శ‌లు చేసే వారు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ బాబు హెచ్చ‌రిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా ప‌వ‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు టీజీ వెంక‌టేశ్‌.

తాజాగా బ‌డ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపించిన మోడీ సర్కారు తీరు కార‌ణంగా ఆ పార్టీతో దోస్తీ వ‌దులుకుంటారా? అన్న ప్ర‌శ్న‌కు టీజీ బ‌దులిస్తూ.. అలాంటి అంశాల‌పై పార్టీ అధినేత‌లు నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్నారు. ఇలాంటివి త‌న స్థాయిలో స్పందించే అంశాలు కావ‌న్నారు. కేంద్రంలో ఎన్డీయే స‌ర్కారు అనుస‌రిస్తున్న తీరుపై ప‌వ‌న్ గ‌తంలో రియాక్ట్ అవుతూ.. ఎంపీలంతా రాజీనామా చేయాల‌న్న దానిపై స్పందించ‌మ‌న్న‌ప్పుడు మాత్రం టీజీ రియాక్ట్ అయ్యారు.

ప‌వ‌న్ చెబితే విన‌టానికి తామేమీ చిన్న పిల్ల‌లం కాద‌ని వెట‌కారం చేసిన టీజీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌కు చెప్పే స్థాయి లేద‌ని తేల్చారు. రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌ను వేస్తూ.. చ‌క్రం తిప్పే చంద్ర‌బాబునే బీజేపీ పట్టించుకోవ‌టం లేద‌న్న టీజీ.. అలాంటిది త‌మ‌ను ప‌ట్టించుకుంటారా? అని చెప్ప‌టం ద్వారా పారిశ్రామిక‌వేత్త అయిన ఈ తెలుగు త‌మ్ముడు త‌మ స్థాయి ఎంత‌న్న‌ది చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. ఏపీకి నిధులు కేటాయించే విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై పార్టీ అధినేత‌.. ముఖ్య‌మంత్రి అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని.. త్వ‌ర‌లోనే నేత‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే టీజీ మాట‌ల్లో ప‌వ‌న్ ను కూర‌లో క‌రివేపాకు మాదిరి తీసివేసిన వైనం క‌నిపిస్తుంది. మ‌రి.. త‌మ‌కు పాఠాలు చెప్పే స్థాయి లేద‌ని చెప్పిన టీజీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ వ‌చ్చి త‌మ‌కు ప్ర‌చారం చేసి పెట్టాల‌ని అంత బ‌లంగా ఎందుకు కోరిన‌ట్లు..? అన్న ప్ర‌శ్న‌కు టీజీ స‌మాధానం చెబితే బాగుంటుంది.