Begin typing your search above and press return to search.

ఏమయ్యా టీజీ..ఇంగిలిపీసు మీద ప్రేమేందయ్యా?

By:  Tupaki Desk   |   19 July 2016 7:24 AM GMT
ఏమయ్యా టీజీ..ఇంగిలిపీసు మీద ప్రేమేందయ్యా?
X
మన పక్కనున్న తమిళుడికి వాడి భాష మీద.. వాడి సంస్కృతి మీద అపారమైన ప్రేమిభిమానాలు ఉంటాయి. కన్నడిగుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కేరళీయులు ఎక్కడున్నా తమ స్వస్థలం మీద.. తమ భాషను ఏ మాత్రం వదిలిపెట్టరు. అదేం ఖర్మో కానీ తెలుగు ప్రజలకే లేనిపోని తెగులు. సీమాంధ్రులతో పోలిస్తే.. తెలంగాణ ప్రజానీకం కాస్తో కూస్తో మెరుగు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమ ఫలితంగా వారిలో ప్రాంతీయ ప్రేమాభిమానంతో పాటు.. వారి యాస మీద కూడా ఎంతో మమకారం పెరిగిన పరిస్థితి. దీనికి భిన్నమైన ధోరణి సీమాంధ్రలో కనిపిస్తుంది. భాష మీద కావొచ్చు.. తమ సంస్కృతి గురించి పెద్దగా పట్టనట్లు కనిపిస్తారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఏపీ టీడీపీ నేత టీజీ వెంకటేశ్ ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. రాయలసీమ హక్కుల కోసం ఏకంగా ఒక ప్రత్యేక దుకాణాన్నే ఏర్పాటు చేసుకొని.. రాయలసీమ వాసుల హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా చెప్పుకోవటం మర్చిపోకూడదు.

మరింత అభిమానం ఉన్న టీజీ వెంకటేశ్.. తన మాతృభాషలో ప్రమాణస్వీకారం చేసే వీలున్నా.. ఆయన మాత్రం ఇంగిలిపీసులో ప్రమాణస్వీకారం చేయటం గమనార్హం. రాజకీయ నాయకుడిగానే కాదు.. సీమ హక్కుల గురించి ఉద్యమకారుడిగా తన గురించి తాను గొప్పలు చెప్పుకునే ఈ సంపన్న పారిశ్రామికవేత్త.. తాజాగా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. టీజీ తన మాతృభాషను వదిలేసి ఇంగిలిపీసులో ప్రమాణం చేస్తే.. కర్ణాటకు నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కన్నడలో ప్రమాణం చేయటం గమనార్హం. ఇక.. అచ్చ తెలుగువాడైన వెంకయ్యనాయుడు.. తాజాగా రాజస్థాన్ నుంచి ఎన్నికై హిందీలో ప్రమాణస్వీకారం చేస్తే.. బీజేపీకి చెందిన శివ ప్రతాప్ శుక్లా అందరి కంటే భిన్నంగా అన్ని భాషలకు అమ్మ భాష అయిన సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేయటం విశేషం. అందరూ అన్నిరకాలుగా చేస్తున్నా.. తెలుగువాడై.. తెలుగు నేలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తెలుగులో ప్రమాణస్వీకారం చేయని టీజీని ఎవరేం అనాలి..? అమ్మ భాష మీద ప్రేమాభిమానాలు లేని వ్యక్తి.. తనను ఎన్నుకున్న ప్రజల్ని అభిమానిస్తారంటారా..?