Begin typing your search above and press return to search.

టీజీకి షాకిచ్చిన చిన‌బాబు

By:  Tupaki Desk   |   10 July 2018 7:22 AM GMT
టీజీకి షాకిచ్చిన చిన‌బాబు
X
ఆర్నెల్ల ముందే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తాం.. చివ‌రి నిమిషం ప్ర‌క‌ట‌న‌ల‌కు బ్రేకులేస్తామ‌న్న మాట టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టినుంచో చెబుతున్న‌దే. విపక్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటి మాట‌లే చెప్పిన‌ప్ప‌టికీ.. టికెట్ ఖ‌రారు మాత్రం నామినేష‌న్ గ‌డువు మ‌రికొద్ది గంట‌ల్లో ముగుస్తుంద‌న్న స‌మ‌యంలోనే ప్ర‌క‌టించ‌టం మొద‌ట్నించి ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఓప‌క్క‌ప్ర‌త్య‌ర్థుల అభ్య‌ర్థులు హుషారుగా ప్ర‌చారం చేసుకుంటున్న వేళ‌.. టీడీపీ అభ్య‌ర్థులు మాత్రం టికెట్ ఖ‌రారు చేసుకునేందుకు భారీ ఎత్తున‌ ప్ర‌య‌త్నాలు చేయ‌టం టీడీపీలో మామూలే. ఇలాంటి వేళ‌.. స‌మీక‌ర‌ణాల సంక్లిష్ట చిక్కుముడులు విప్ప‌దీసే ప‌నిని పెట్టుకోవ‌టం చంద్రబాబుకు మొద‌ట్నించి అల‌వాటే. అయితే.. ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఇప్పుడు వార్త‌ల్లోకి ఎక్కారు చంద్ర‌బాబు త‌న‌యుడు ఏపీ మంత్రి లోకేశ్‌.

తండ్రి మాదిరి చివ‌రి క్ష‌ణాల వ‌ర‌కూ టికెట్ స‌స్పెన్స్ ఎందుకన్న ఆలోచ‌న మంచిదే. అలా అని.. చిత్ర‌మైన కాంబినేష‌న్లు ఉన్న‌చోట ఏడాది ముందే పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌టం కూడా అంత క్షేమ‌క‌రం కాదు.కానీ.. ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా లోకేశ్ చేసిన ప్ర‌క‌ట‌న క‌ర్నూలు అసెంబ్లీ.. పార్ల‌మెంటు స్థానం విష‌యంలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల్ని సృష్టిస్తోంది. తాజాగా క‌ర్నూలు ప‌ర్య‌ట‌న చేస్తున్న చినబాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ స్థానాన్ని బుట్టా రేణుక‌కు..అసెంబ్లీ స్థానాన్ని ఎస్వీ మోహ‌న్ రెడ్డికి కేటాయిస్తున్న‌ట్లు చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు.

సంచ‌ల‌నం అన్న‌ది ఎందుకంటే.. క‌ర్నూలు అసెంబ్లీ స్థానాన్ని టీజీ వెంక‌టేశ్ బ‌లంగా కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్‌ను బ‌రిలో దింపాల‌ని భావిస్తున్నారు. ఇందుకుత‌గ్గ‌ట్లు గ‌డిచిన నాలుగేళ్లుగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు.

క‌ర్నూలు కేంద్రంగా ఆయ‌న క్యాడ‌ర్ ను సిద్దం చేసుకోవ‌టంతో పాటు.. త‌న కొడుక్కు టికెట్ ద‌క్కేలా చేయ‌టం కోసం పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు అసెంబ్లీ స్థానానికి టీడీపీ త‌ర‌ఫున టీజీ వెంక‌టేశ్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫున ఎస్వీ మోహ‌న్ రెడ్డి పోటీ ప‌డ‌టం తెలిసిందే. స్వ‌ల్ప అధిక్య‌త‌తో ఎస్వీ మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించారు. అనంత‌రం.. పార్టీ నుంచి జంప్ అయి టీడీపీ గూటికి చేరారు. నాటినుంచి 2019 టికెట్ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇలా బ‌ల‌మైన ఇద్ద‌రు నేత‌లు టికెట్ కోసం పోటాపోటీగా పావులు క‌దుపుతున్న చోట‌.. ఉరుము మెరుపు లేకుండా పిడుగు వేసిన‌ట్లుగా.. చిన‌బాబు ప్ర‌క‌ట‌న ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చిన‌బాబు అనూహ్య ప్ర‌క‌ట‌న‌తో టీజీ బాగా హ‌ర్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. త‌న అసంతృప్తిని లోకేశ్‌కు తెలియ‌జేయ‌టంతో పాటు.. పెద్దాయ‌న దగ్గ‌రే విష‌యాన్ని తేల్చుకుంటాన‌న్న మాట‌ను త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఒక‌వేళ‌.. టికెట్ విష‌యంలో తేడా వ‌స్తే.. అనూహ్య నిర్ణ‌యానికైనా టీజీ సిద్ధ‌మ‌న్న మాట వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. టీడీపీకి ఎంతోకొంత న‌ష్టం ఖాయం. అయినా.. నేర్పుగా తేల్చాల్సిన ఇష్యూల్ని.. బండ ప‌ద్ధ‌తి డీల్ చేయాల‌నుకోవ‌టం స‌రికాద‌ని.. లోకేశ్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రి.. లోకేశ్ ప్ర‌క‌ట‌న‌పై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.