Begin typing your search above and press return to search.

జగన్ పై టీజీ ప్రశంసలు..వాటీజ్ ద మ్యాటర్?

By:  Tupaki Desk   |   6 Sep 2019 11:23 AM GMT
జగన్ పై టీజీ ప్రశంసలు..వాటీజ్ ద మ్యాటర్?
X
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఓ రేంజీలో విరుచుకుడిన సంగతి తెలిసిందే కదా. నవ్యాంధ్ర నూతన రాజధానిపై వైసీపీ మంత్రులు చేసిన ప్రకటనలతో రేగిన రచ్చ నేేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన టీజీ... రాజధానిపై జగన్ స్పష్టమైన వైఖరితో లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ మదిలో ఏపీకి నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలన్న భావన ఉందంటూ టీజీ చేసిన వ్యాఖ్యలు నిజంగానే పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు గానీ... ఈ వ్యాఖ్యలు చేసి కనీసం వారం రోజులు కూడా కాకముందే జగన్ పై టీజీ తన వైఖరిని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాయలసీమ అబివృద్ధి కోసం కర్నూలులో విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా టీజీ చేసిన వ్యాఖ్యలే... జగన్ పై ఆయన వైఖరి మారిందన్న సంకేతాలు ఇస్తున్నాయి.

అయినా జగన్ పై టీజీ ఏమన్నారన్న విషయానికి వస్తే... ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగానే జగన్ ముందుకు సాగుతున్నారని టీజీ వెంకటేశ్ అన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో జగన్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా జగన్ కు వత్తాసు పలికారు. నిధుల విషయంలో ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు కూడా తావు లేదని కూడా టీజీ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వమైనా సర్కారీ ఖజానాను ఖాళీ చేసేస్తుందని - ఇప్పుడు కూడా టీడీపీ సర్కారు ఖజానాను ఖాళీ చేసిందని - అయినా కూడా జగన్ తన హామీల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా టీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా ఇచ్చిన హామీలను అమలు చేసే దాకా జగన్ నిద్రపోరన్న రీతిలో టీజీ సంచలన వ్యాఖ్యలే చేశారు.

ఈ వ్యాఖ్యలతో జగన్ పై టీజీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్న వాదన వినిస్తోంది. ఎన్నికలకు ముందు కర్నూలు అసెంబ్లీ సీటును తన కుమారుడికి ఇప్పించుకునే విషయంలో టీడీపీ అధిష్ఠానంతో టీజీ ఏకంగా ప్రత్యక్ష యుద్ధానికే దిగినట్టుగా కనిపించారు. ఒకవేళ టీడీపీ తరఫున కర్నూలు అసెంబ్లీ సీటు తన కుమారుడికి దక్కకపోతే... అప్పటికప్పుడే కుమారుడితో కలిసి వైసీపీలోకి వెళ్లిపోయేందుకు కూడా టీజీ వ్యూహం రచించారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజమేనన్నట్లుగా ఇప్పుడు టీజీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏ పార్టీ అయినా తన పబ్బం గడవడమే ముఖ్యమని భావించే టీజీ... ఇప్పుడు వైసీపీలోకి చేరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతికి ఉన్నాయని చెప్పారు. ఏపీలోని నాలుగు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసిన తర్వాతే అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని... కేంద్రం నిధులతో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు.