Begin typing your search above and press return to search.

టీజీ మాటలు.. వీటిల్లో పస ఉందా?

By:  Tupaki Desk   |   2 Oct 2019 3:26 PM GMT
టీజీ మాటలు.. వీటిల్లో పస ఉందా?
X
భారతీయ జనతా పార్టీకి రాయలసీమ మీద చాలా ఆశలే ఉన్నాయి. అయితే ఆశలు ఉన్నా.. ప్రజలకు చేసేది మాత్రం ఏమీ లేదు. కనీసం రాయలసీమ వరకూ అయినా ప్రత్యేక హోదా గట్రా ప్రకటించి ఉన్నా అదో గౌరవంగా ఉండేది. అయితే బీజేపీ వాళ్లు ఏపీకి మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. తమ ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి కూడా వాళ్లకు మనసు ఒప్పడం లేదు. ఏపీకంతటికీ ప్రత్యేకహోదా ఇవ్వడం మాట అటుంచి..కనీసం రాయలసీమ వరకూ - గ్రేటర్ రాయలసీమ వరకూ ప్రత్యేకహోదా ఇచ్చినా బీజేపీకి అంతో ఇంతో పరువు నిలబడుతుంది.

అయితే అలాంటివి ఏమీ ఉండవు. జనాలు ఎగేసుకుని వెళ్లి బీజేపీకి ఓటేయాలి. అదీ బీజేపీ మార్కు రాజకీయం. ఆ పార్టీ సంగతలా ఉంటే..అక్కడకు చేరిన నేతల హడావుడి ఇంకా ఎక్కువగా ఉంది.

అలాంటి వారిలో ఒకరు టీజీ వెంకటేష్. ఇటీవలే బీజేపీ నేత అయిన ఈయన ఎంపీ హోదాలో రాజధాని గురించి తెగ మాట్లాడుతూ ఉన్నారు. కర్నూలే రాజధాని అని - కర్నూలును రాజధానిగా చేయాలని - కర్నూలు రాజధానికి అనువైన ప్రాంతం.. అంటూ మాట్లాడుతూ ఉన్నారు.

మరి ఇంత కర్నూలు వీరాభిమాని.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినట్టు? అప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి స్మరణ చేస్తూ .. కర్నూలుకు కించిత్ విలువ అయినా ఇవ్వనప్పుడు ఏం చేసినట్టు?అంటే.. సమాధానాలు లేవు!

అప్పుడు చంద్రబాబు వద్ద ఉన్నాడు కాబట్టి.. కిక్కురుమనలేదు. ఇప్పుడు రాయలసీమలో ఏదో రాజకీయం చేసేయాలని బీజేపీ తాపత్రయపడుతోంది కాబట్టి.. ఇలాంటి మాటలు. మరి టీజీ మాటల్లో ఉన్న పస ఎంత? అంటే.. అది బీజేపీ వాళ్లకే తెలియాలి. టీజీ ఇలాంటి వాదనలను మీడియా ముందు కన్నా..వెళ్లి ఢిల్లీలో తమ పార్టీ అధిష్టానం ముందు వినిపిస్తే అసలు సంగతి తేలుతుందేమో.అలాంటి పని ఈ ఎంపీ ఎందుకు చేయడం లేదో!