Begin typing your search above and press return to search.

టీజీ చెప్పారా?.. ఇక ఎప్పటికి కానట్లే?

By:  Tupaki Desk   |   26 Aug 2019 2:30 PM GMT
టీజీ చెప్పారా?.. ఇక ఎప్పటికి కానట్లే?
X
కొందరి నోటి నుంచి మాట వస్తే శిలాశాసనంగా మిగిలిపోతుంది. తాము చెప్పిన మాట కోసం దేనికైనా.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ.. దీనికి భిన్నమైన వారుకొందరుంటారు. వారి నోటి నుంచి మాట వచ్చిందంటే.. ఇక మటాషే. కామెడీగా అనిపించినా.. ఇది నిజం. ఇదేమీ అల్లాటప్పాగా చెప్పటం లేదు. గత చరిత్రను చూసినప్పుడు అసలు విషయం అర్థం కాక మానదు.

కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేశ్ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో కామ్ గా ఉండే ఆయన.. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా కల్పించుకొని మరీ మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన కానివ్వమన్న ఆయన మాటకు ఏం జరిగిందో తెలిసిందే. సమైక్యం కోసం మాట్లాడిన టీజీ.. ఆ తర్వాత కాలంలో సీమ గురించి.. సీమ ప్రయోజనాల గురించి మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చేసినన్ని శపధాలు.. సవాళ్లలో ఏ ఒక్కటి ముందుకు వెళ్లలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత బాబు మనసు దోచేసి.. రాజ్యసభ సీటు సాధించటం తెలిసిందే. ఆ తర్వాత ఆయన నోటి నుంచి పెద్ద మాటలు వచ్చిందే లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాబు ఓడినంతనే.. బాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా..సీఎం రమేశ్ లతో పాటు బీజేపీలోకి జంప్ అయిన టీజీ.. గడిచిన రెండు.. మూడు రోజులుగా భారీ డైలాగులు చెబుతున్నారు.

నిన్నటికి నిన్న ఏపీలో నాలుగు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లుగా జోస్యం చెప్పి సంచలనంగా మారారు. ఆయన మాటల మీద ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ.. ఆయన నోటి నుంచి మరో వ్యాఖ్య వచ్చింది. అదేమంటే.. ఏపీలో బీజేపీ జెండా ఎగరనుందని. అధికారంలో రౌడీలు.. గూండాలు.. ఫ్యాక్షనిస్టులు ుంటే ప్రజలకు పనులు చేయలేరంటూ సంచలన వ్యాఖ్య చేశారు.

సేవ అన్నది బీజేపీ బ్లడ్ లో ఉందన్న టీజీకి ఇప్పుడే అవన్నీ కనిపించటం ఏమిటి? బీజేపీ జెండా ఏపీలో త్వరలో ఎగురుతుందన్న టీజీ మాట వింటేనే అర్థమవుతుంది.. అదెంత నిజమన్నది. ఏమైనా సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న టీజీ.. ఇంతకాలం నిశ్శబద్దంగా ఉండి ఇప్పుడే ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్లు? దీని వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటి టీజీ సాబ్?