Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర మీద పడతావేంది టీజీ?

By:  Tupaki Desk   |   31 Dec 2019 12:55 PM GMT
ఉత్తరాంధ్ర మీద పడతావేంది టీజీ?
X
నేతలన్నాక రాజకీయం చేస్తారు. కానీ.. దానికో హద్దు ఉంటుంది. కానీ.. అలాంటివేమీ పట్టకుండా తమ ప్రయోజనాలు మినహా జనాలు.. రాష్ట్రం ఏమైపోయినా ఫర్లేదన్నట్లుగా మాట్లాడే నేతలు ఏపీలోనే కనిపిస్తారు. నిజానికి ఈ తీరే రాష్ట్ర విభజనకు కారణమైందని చెప్పాలి. తెలంగాణ ప్రజల్లోనూ..నేతల్లోనూ తమ ప్రాంతం పట్ల ఉండే కమిట్ మెంట్ సీమాంధ్రకు చెందిన నేతల్లో అస్సలు కనిపించదు.

ఒకేచోట పోగుపడినట్లుగా అభివృద్ధి చెందే కన్నా.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ తెర మీదకు వచ్చినప్పుడు అది నచ్చకుంటే.. ఆ విషయాన్ని చెప్పే తీరుతో చెప్పాలే కానీ.. ప్రాంతాల మధ్య పంచాయితీలు పెట్టేలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. తాజాగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాటల్ని చూస్తే.. ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని గాయపరిచేలా.. ఇంతకాలం వారికి జరిగిన అన్యాయం గురించి కడుపు మండేలా మాట్లాడటంలో ఏమైనా న్యాయం ఉందా? అన్న భావన కలుగక మానదు.

విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసిన పక్షంలో.. అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ వారిని తరిమేయరన్న గ్యారెంటీ ఏమిటన్న ప్రశ్న వేసిన టీజీ తీరు చూస్తే..ఇలాంటి వారి వల్ల కదా ఏపీ నేతలంటే అందరికి చులకన కలుగుతుందన్న భావన కలగటం ఖాయం. మీరంతా ఒకటి.. మేమంతా ఒకటన్న ఉద్దేశంతో విభజన జరిగిన తర్వాత.. ప్రాంతాలకు అతీతంగా.. సోదరభావాన్ని పెంపొందించేలా వ్యవహరించాల్సింది పోయి.. సీమ.. ఉత్తరాంధ్ర.. ఆంధ్రా.. అంటూ విభజించి మాట్లాడటంలో అర్థం లేదు.

విభజన గాయం నుంచి ఇంకా కోలుకోముందే.. సీమ పేరుతో టీజీ చేసే వ్యాఖ్యలు మిగిలిన వారి మనసుల్ని గాయపరిచేలా ఉంటాయి. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు నచ్చకుంటే ఆ విషయాన్ని సూటిగా చెప్పేయాలి. కానీ.. అందుకు తన పైత్యాన్ని జనాల మీద రుద్దేసేలా మాట్లాడటం సబబు కాదు. గతాన్ని తనకు తగ్గట్లుగా అన్వయించుకొని.. భవిష్యత్తులో జరగని వాటిని జరుగుతాయన్న సందేహంతో మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదు. రాజధాని మార్పుతో ఏపీ మరింత బాగుపడాల్సింది పోయి.. ఇలా అపశకునపు మాటలు అవసరమా? అన్నది ప్రశ్న.

తాజాగా టీజీ వ్యాఖ్యల్ని చూస్తే.. రాయలసీమ తరపున ఒక్కటే అడుగుతున్నా. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ రాజధానిగా ఉండేది. విడిపోయాక బంగారు పళ్లెంలో తీసుకెళ్లి అమరావతిలో రాజధాని పెట్టారు. అమరావతి వెళ్లటమే చాలా కష్టం అవుతుంటే.. ఇప్పుడు బంగారు పళ్లెంలో తీసుకెళ్లి విశాఖలో పెడుతున్నారు. బాబు.. జగన్ ఇద్దరు సీమ వారే. సీమ వారికి పొరుగింటి పుల్లకూర రుచి. తమ ప్రాంతం కంటే ఇతర ప్రాంతాల వారిని బాగా చూసుకోవాలని ఉంటుందన్న మాటల్ని చూస్తుంటే.. టీజీ ప్లాన్ ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు. సీమ వారిని ఏకం చేసేలా మాట్లాడుతూనే.. ఆంధ్రా.. ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని ఇబ్బంది పెట్టేలా ఆయన మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. విశాఖలో రాజధాని అక్కర్లేదంటే ఇలాంటి అనవసరమైన వాదనలు వినిపించే కంటే.. ఎందుకు అక్కర్లేదు? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమిటన్నది చెబితే సరిపోయేదానికి ఇలాంటి మాటలు అవసరమా టీజీ అడగాలనిపించక మానదు.