Begin typing your search above and press return to search.

క‌ర్నూలులో టీజీ లొల్లి మొద‌లైందిగా!

By:  Tupaki Desk   |   6 Aug 2017 4:48 PM GMT
క‌ర్నూలులో టీజీ లొల్లి మొద‌లైందిగా!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎంపిక చూస్తే ముచ్చ‌ట ప‌డిపోవాల్సిందే. మాణిక్యాల్లాంటి నేత‌ల్ని ఆయ‌న ఏరికోరి మ‌రీ ఎంపిక చేసుకుంటారు. ఆయ‌న ఎంతో ముచ్చ‌ట ప‌డి ఎంపిక చేసుకున్న వారంతా కూడా అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు.. స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద‌పీట వేసే వారే క‌నిపిస్తారు. ఏరికోరి ఏంపిక చేసుకునేట‌ప్పుడు.. ప‌ద‌వుల మీద ఆశ కంటే పార్టీ కోసం.. పార్టీ అధినేత కోసం ఎంత‌కైనా స‌రే.. అన్న‌ట్లుగా అనిపించే నేతలు చాలా చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తారు.

బాబు ఎంపిక ఎలా ఉంటుంద‌న‌టానికి క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్ని చూసుకుంటే బాగా అర్థ‌మ‌వుతుంది. ఈ స్థానం నుంచి 2004 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు ప్ర‌ముఖ పారిశ్రామివేత్త టీజీ వెంక‌టేశ్‌. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. దీంతో.. ఆయ‌న కొద్ది కాలానికే టీడీపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం చేసుకున్నారు.

2009 ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆయ‌న కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున క‌ర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. కాలం క‌లిసి వ‌చ్చి ఏకంగా రాష్ట్ర మంత్రిగా ప‌ని చేశారు. రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో తాను చాలా సీరియ‌స్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి.. స‌రిగ్గా విభ‌జ‌న జ‌రిపే స‌మ‌యానికి అమెరికాకు ఫ్యామిలీతో స‌హా వెళ్లిపోయిన టీజీ.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీలో కాంగ్రెస్ చ‌చ్చిపోయింద‌న్న విషయాన్ని గుర్తించి ఆయ‌న కాంగ్రెస్ ను వ‌దిలేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌ర్నూలు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు.

అయితే.. ఆయ‌న ఓట‌మిపాలై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ఎస్వీ మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించారు. ప‌ద‌వి లేకుండా అస్స‌లు ఉండ‌లేని టీజీ.. మొత్తానికి బాబు మ‌న‌సును గెలుచుకొని రాజ్య‌స‌భ సీటుకు త‌న పేరు ఓకే అయ్యేలా చేసుకున్నారు.

పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ ఎంత‌మేర‌కు సాయం చేశార‌న్న విష‌యాన్ని టీజీనే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గుర్తించ‌కుండా ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ఇప్పించేశారు. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో భూమా ఫ్యామిలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార‌ప‌క్షానికి వ‌చ్చేసిన దివంగ‌త భూమా.. ఆయ‌న కుమార్తెతో పాటు.. భూమా బావ‌మ‌రిది క‌మ్ క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహ‌న్ రెడ్డి కూడా ఫ్యాన్ ను వ‌దిలేసి సైకిల్ ఎక్కేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌న‌కున్న ప‌ద‌వి స‌రిపోలేదేమో కానీ.. టీజీ త‌న కుమారుడు భ‌ర‌త్ ను త‌న రాజ‌కీయ వార‌సుడిగా బ‌రిలోకి దించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మొన్న‌టి దాకా టీడీపీ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లోనే జ‌రిగిన ఈ చ‌ర్చ తాజాగా టీజీ వెంక‌టేశ్ ఒక అడుగు ముందుకేసి.. త‌న కుమారుడు 2019 లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టీజీ ప్ర‌క‌ట‌న‌తో ఒక్క‌సారిగా క‌ర్నూలు రాజ‌కీయ ప‌రిస్థితి మ‌రింత వేడెక్కింది.

ఓప‌క్క సిట్టింగ్ ఎమ్మెల్యే.. అందునా జ‌గ‌న్ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేను వ‌దిలేసి బాబు టీజీ కొడుక్కి తాను కోరుకున్న‌ట్లుగా క‌ర్నూలు అసెంబ్లీ సీటు ఇస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఒక‌వేళ ఇస్తే.. ఎస్వీ మోహ‌న్ రెడ్డిని ఏం చేస్తార‌న్న‌ది మ‌రో సందేహం. అన్నింటికి మించి.. ఈ ఎపిసోడ్‌ కు సంబంధించి టీజీకి కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చేలా మోహ‌న్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచే క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని.. అయితే టీజీ కుమారుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలీద‌ని చుర‌క వేశారు. టీజీ.. ఎస్వీల పోటాపోటీ ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌రో 20 నెల‌ల త‌ర్వాత జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి క‌ర్నూలులో.. ఇప్పుడే రాజుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా ప‌రిణామాలు చూస్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇప్పుడున్న త‌ల‌నొప్పులు స‌రిపోనట్లు టీజీ త‌ల‌నొప్పి కూడా షురూ అయిన‌ట్లేన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.