Begin typing your search above and press return to search.

సీమే కాదు.. ఉత్త‌రాంధ్ర కూడా అంటున్న టీజీ

By:  Tupaki Desk   |   7 May 2015 9:26 AM GMT
సీమే కాదు.. ఉత్త‌రాంధ్ర కూడా అంటున్న టీజీ
X
మాజీ మంత్రి టీజీ వెంక‌టేశ్ వ్య‌వ‌హారం కాస్త వేరుగా ఉంటుంది. ఆయ‌న ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో ఎవ‌రికి అర్థం కాదు. తెలంగాణ ఉద్య‌మం కాస్తంత ఉధృతం అయిన ప్ర‌తిసారీ రాయ‌ల‌సీమ హ‌క్కులు అని మాట్లాడేవారు. అలా అని.. సీమ హ‌క్కుల కోసం ఆయ‌న క‌మిట్ మెంట్‌తో ఉంటారా? అంటే అదీ ఉండ‌దు.
రెండు ప్రెస్‌మీట్లు.. నాలుగు తిట్లు.. ఆరు డిమాండ్లుగా సాగుతుందే త‌ప్పించి..ఇంకేమీ ఉండ‌దు.తాను చెబుతున్న మాట‌ల సాధ‌న కోసం ఆయ‌న ఎంత క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేస్తార‌న్న‌ది విభ‌జ‌న స‌మ‌యంలో చూసిన ప్ర‌తిఒక్క‌రికి అర్థ‌మైంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన స‌మ‌యంలో రాయ‌ల‌సీమ హ‌క్కుల వేదిక ఏర్పాటు చేసి.. అప్పుడ‌ప్పుడు తాను కూడా ఉన్నాన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న 2009లో ఎమ్మెల్యేగా గెలిచి.. సుడి తిరిగిపోయి మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌.. ఆయ‌న నిత్యం మాట్లాడే రాయ‌ల‌సీమ‌కు ఏదైనా చేశారా? అంటే అది కాస్త శూన్య‌మే.

ఇక‌.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఓట‌మి పాలైన ఆయ‌న‌.. గ‌త ప‌ది నెల‌లుగా పెద్ద‌గా మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్నారు. ఈమ‌ధ్య‌నే రాయ‌ల‌సీమ హ‌క్కుల గురించి మాట్లాడిన ఆయ‌న‌..తాజాగా సీమ‌తోపాటు.. ఉత్త‌రాంధ్ర గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒక ప్రాంతీయ‌నేత‌కు.. మ‌రో ప్రాంతం గురించిన ప్రేమ ఎందుకు?
సీమ‌.. ఉత్త‌రాంధ్ర ప‌రిర‌క్ష‌ణ వేదిక‌కు అధ్య‌క్షుడిగా త‌న‌ను తాను ప్ర‌క‌టించుకున్న ఆయ‌న‌.. వాటి హ‌క్కుల కోసం పోరాడుతాన‌ని చెబుతున్నారు. వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప‌రిహారం.. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. రాయ‌ల‌సీమ‌కు మ‌రో రాజ‌ధాని ఉండాల‌ని.. ఇప్ప‌టికే దేశంలోని క‌ర్ణాట‌క‌.. మ‌హారాష్ట్ర.. కాశ్శీర్ ల‌కు రెండేసి రాజ‌ధానులు ఉన్నాయ‌ని చెప్పిన ఆయ‌న‌..సీమ‌లో కూడా ఏపీ రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

సీమ ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని సీమ‌లోనే ఖ‌ర్చు చేయాల‌న్న విచిత్ర‌మైన వాద‌న‌ను తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈ వాద‌న ప్ర‌కారం చూస్తే.. క‌ర్నూలు.. చిత్తూరు.. క‌డ‌ప జిల్లాల సంగ‌తి ఓకే.. మ‌రి.. అనంత‌పురం జిల్లా మాటేమిటి? ఆ జిల్లాకు ఆదాయం చాలా చాలా త‌క్కువ‌. మిగిలిన జిల్లాల ఆదాయాన్ని పంచాల్సి ఉంటుంది. ఇదేమీ ప‌ట్టించుకోకుండా.. టైం పాస్ కోస‌మ‌న్న‌ట్లుగా టీజీ మాట‌లు ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. వెనుకా..ముందు చూసుకోకుండా మాట్లాడే క‌న్నా.. కాస్తంత క‌మిట్ మెంట్‌తో టీజీ మాట్లాడితే బాగుంటుంది.