Begin typing your search above and press return to search.

టీడీపీపై మాజీ మంత్రి అల‌క‌

By:  Tupaki Desk   |   23 Nov 2015 7:59 AM GMT
టీడీపీపై మాజీ మంత్రి అల‌క‌
X
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక, 2014 ఎన్నిక‌ల ముందు ఇత‌ర పార్టీల నేత‌లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఆ పార్టీలో చేరిపోయారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కూ ఇత‌ర పార్టీల్లో ఉన్న‌ నాయ‌కులంతా టీడీపీ గూటికి చేరిపోయారు. కొంద‌రు ప‌దవులు ఆశించి పార్టీలో చేరితే.. మ‌రికొంద‌రు రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని కాపాడుకునేందుకు జెండా మార్చేశారు. ఎన్నిక‌ల‌య్యాయి..ఏడాదిన్న‌ర గ‌డుస్తోంది. మ‌రి ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు? వారిలో చాలా మంది సీనియ‌ర్లు టీడీపీలో ఇమ‌డ లేక‌పోతున్నార‌ట‌. పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌ గా పాల్గొన‌లేక‌పోతున్నార‌ని టీడీపీ వ‌ర్గాల్లోనే స‌మాచారం విన‌వ‌స్తోంది.

ఈ జాబితాలో ముందుగా వినిపించే పేర్లు జేసీ దివాక‌ర్ రెడ్డి - టీజీ వెంక‌టేష్‌.. ఒక‌రు పార్టీ వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు చేస్తూఉంటే.. మ‌రొక‌రు పూర్తిగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీజీ వెంక‌టేష్ టీడీపీలో క‌క్క‌లేక మింగ‌లేక ఉంటున్నారు. మొన్న ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో టీడీపీలోకి వ‌చ్చి మంత్రి అవుదామ‌ని క‌ల‌లు కన్నాడు. క‌ర్నూలు నుంచి పోటీ చేసిన ఆయ‌న ఎస్వీ మోహ‌న్‌ రెడ్డి చేతిలో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోవ‌డంతో ఆయ‌న ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పుడు ఆయ‌న్ని చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వెంక‌టేష్ లోలోప‌లే కుమిలిపోతున్నార‌ట‌. అంతేగాక జిల్లాలో ఎవ‌రూ త‌న మాట విన‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నార‌ని సమాచారం. అందుకే పార్టీ కార్య‌క్ర‌మాల‌కూ దూరంగా ఉంటున్నార‌ట‌. ఇలా ఓ పది పదిహేనుమంది పేరున్న నాయకులు త‌మ‌ను టీడీపీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాళ్లు త‌మ బాధ‌ను ఎవ్వ‌రికి చెప్పుకోలేక లోలోప‌లే కుమిలిపోతున్నార‌ని తెలుస్తోంది.

బీజేపీ టీడీపీకి మిత్ర‌ప‌క్షం కావ‌డంతో వీరంతా బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ఛాన్సులు లేవు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది.. కేంద్రమేమో నిధులు రాల్చ‌డం లేదు. వెరసి, కాంట్రాక్టుల్ని ఆశిస్తున్న నేతల పరిస్థితి మ‌రింత దిగ‌జారిపోయింది. ఈ పరిస్థితుల్లో టీడీపీని నమ్ముకోవడం అనవసరమనే భావ‌నకు మెజార్టీ నేతలు వచ్చేసినట్లు తెలుస్తోంది. రానున్న ఏడాది, రెండేళ్ళలో ఖచ్చితంగా పార్టీలో వ్యతిరేకత పెరిగిపోతుందని చంద్రబాబు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చార‌ట‌. ఆ వ్యతిరేకతని అధిగమించడం చంద్రబాబు ముందున్న పెను సవాల్‌.