Begin typing your search above and press return to search.

విభజన సరిపోదా.. మళ్లీ బోడి సలహాలేంది టీజీ?

By:  Tupaki Desk   |   1 Nov 2019 6:32 AM GMT
విభజన సరిపోదా.. మళ్లీ బోడి సలహాలేంది టీజీ?
X
తన వ్యాపారాలు.. తన రాజకీయాలు తప్పించి.. మరింకేమీ పట్టని నేతలు ఏపీలో చాలామంది ఉన్నారు. నిజానికి ఈ తరహా సీజనల్ రాజకీయ నేతల వల్లే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని చెప్పాలి. సీరియస్ గా చేయాల్సిన రాజకీయాల్ని స్వార్థం కోసం చేయటం.. ప్రజా ప్రయోజనాల కన్నా వ్యాపార ప్రయోజనాలు.. వ్యక్తిగత ప్రయోజనాలకు నేతలు పరిమితం కావటంతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది.

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఇదే టీజీ.. నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. ఉద్రిక్తలు పెరిగేలా చేయటం చేశారు. ఇంతా చేసిన ఆయన.. సరిగ్గా ఉద్యమం పీక్స్ కు వెళ్లినప్పుడు.. ఏపీ తరఫున బలంగా వాదనలు వినిపించాల్సిన వేళలో.. ఫ్యామిలీతో సహా అమెరికాకు వెళ్లిపోయి రెండు.. మూడు వారాలకు పైనే అక్కడే ఉండిపోవటాన్నిమర్చిపోలేం.టీజీ లాంటి వారి అనవసర వ్యాఖ్యల కారణంగా ఏపీ ప్రజలకు జరిగిన విభజన డ్యామేజ్ సరిపోదన్నట్లుగా తాజాగా ఆయన మాటలు మరింత విచిత్రంగా ఉన్నాయని చెప్పాలి.

గడిచిన ఐదారేళ్లలో ఏపీ ప్రయోజనాల గురించి బలంగా నోరు విప్పని టీజీ.. ఇప్పుడు మళ్లీ గళం విప్పటం వెనుక ఏదో రహస్య ఎజెండా ఉండే ఉండాలి. ఎమ్మెల్యేగా ఓడి రాజ్యసభ ఎంపీ పదవిని చేజిక్కించుకున్న తర్వాత గమ్ముగా ఉన్న ఆయన.. ఒక్కరోజంటే ఒక్క రోజు రాజ్యసభలో ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. రాయలసీమ వెనుకబాటు గురించి మాట్లాడింది లేదు.

విలేకరులు సమావేశంలోనూ.. మీడియా మైకుల ముందు తనకున్న తెలివితేటల్ని ప్రదర్శించే టీజీ మహాశయుడు.. తానుగా చేయాల్సిన ఏ పనిని చేయరన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అలాంటి టీజీ తాజాగా రాష్ట్ర రాజధానిని మూడుగా చేయాలంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఒంటెద్దు పోకడలతో బాబు చేసిన అమరావతి ప్రాజెక్టు మీద పలువురికి పలు సందేహాలు ఉన్నాయి. ఇలాంటివేళ.. మూడు రాజధానులు.. ప్రత్యేక రాయలసీమ లాంటి మాటలు మాట్లాడుతూ కొత్త తలనొప్పులు తెచ్చేందుకు సిద్ధమవుతున్న టీజీ లాంటి వారి దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.

ఏపీకి మూడు రాజధానులు అవసరమని.. అప్పుడు రాయలసీమ అభివృద్ధి చెందుతుందని చెబుతున్న టీజీ.. సీమ ప్రయోజనాల కోసం ఆయన ఇప్పటివరకూ ఎలాంటి పోరాటం చేశారో చెబితే బాగుంటుంది. కృష్ణ, తుంగభద్ర జలాలు రాయలసీమకే చెందాలనే ఆయన మాటలు విన్నప్పుడు.. ప్రాంతీయ రాజకీయాలకు తెర తీయటం ద్వారా కొత్త ఉద్రిక్తతలకు తెర తీయాలన్న ఆలోచనలో టీజీ ఉన్నారా? అన్న భావన కలుగక మానదు. సీమ గురించి తపించిపోయినట్లు మాట్లాడే టీజీ.. తాను మంత్రిగా ఉన్న వేళలో సీమ వరకూ ఎందుకు తాను ప్రాతినిధ్యం వహించే కర్నూలు జిల్లాకు ఏం చేసుకున్నారో చెబితే మంచిది. ఆ తర్వాతే మూడు రాజధానులేంది? ముప్పై ఆరు రాజధానులు కూడా చేసుకోవచ్చన్నది మర్చిపోకూడదు.