Begin typing your search above and press return to search.

సీఏఏను వ్యతిరేకించే వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఠాక్రే

By:  Tupaki Desk   |   10 Feb 2020 9:20 AM GMT
సీఏఏను వ్యతిరేకించే వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఠాక్రే
X
పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న నిరసనలు.. ఆందోళనలకు ధీటుగా రియాక్ట్ కావాల్సిన అధికారపక్షం అంచనాలకు తగ్గట్లు రియాక్ట్ కాలేదన్న విమర్శలు ఉన్నాయి. సీఏఏ మీద విపక్ష నేతలు కొందరు చేస్తున్న విమర్శలు.. ఆరోపణలపై మోడీ సర్కారు స్పందించి తిప్పి కొట్టాల్సింది పోయి డిఫెన్స్ లో పడి పోయినట్లు మౌనంగా ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.చేస్తున్నది మంచి పని అయినప్పడు.. దాని గురించి చెప్పాల్సిన అవసరం కేంద్రం మీద ఉంది కదా? అని ప్రశ్నిస్తున్నారు.

తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నిలదీయటంతో పాటు.. సానుకూలాంశాలపై చర్చ జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. సీఏఏ మీద సాగుతున్న రగడకు వ్యతిరేకం గా ఇప్పటి వరకూ బలమైన గళాన్ని విప్పింది లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ తాజాగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా తీవ్రస్థాయి లో విరుచుకు పడ్డారు.

సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు.. నిరసనలు ఎందుకు చేస్తున్నారో? తనకు అర్థం కావటం లేదన్నారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో రాళ్లు ఎందుకు విసురుతున్నారు? హింసకు ఎందుకు పాల్పడుతున్నారు? ఆస్తుల్ని ఎందుకు దహనం చేస్తున్నారు? ఇకపై ఇలా చేస్తే మేం ఊరుకోమంటూ రాజ్ ఠాక్రే వార్నింగ్ ఇస్తున్నారు.

కంటికి కన్ను.. పంటికి పన్ను అన్నట్లుగా రాయికిరాయితోనే.. కత్తికి కత్తితోనే బదులిస్తామని చెప్పారు. భారత్ ఏమీ ధర్మశాల ఏమీ కాదన్న రాజ్ ఠాక్రే.. భారత్ లో ఉన్న పాక్.. బంగ్లాదేశ్ లకుచెందిన అక్రమ చొరబాటుదారుల్ని వెనక్కి పంపాల్సిందేనని స్పష్టం చేశారు. ఎప్పటిలానే తన మార్క్ డైలాగ్ ను చెప్పుకొచ్చారు. దేశం నుంచి చొరబాటుదారుల్ని తరిమి వేసేందుకు పోలీసులకు కేంద్రం 48 గంటల సమయం ఇవ్వాలని సూచించారు.