Begin typing your search above and press return to search.

ఆర్థిక నేర‌గాడికి 13 వేల సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌!

By:  Tupaki Desk   |   30 Dec 2017 6:33 PM GMT
ఆర్థిక నేర‌గాడికి 13 వేల సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌!
X
మా కంపెనీలో ప‌ది వేలు పెట్టుబ‌డి పెడితే చాలు.....ప‌ది నెల‌లు తిర‌గ‌కుండా ప‌ది ల‌క్ష‌లు సంపాదించే సువ‌ర్ణావ‌కాశం.....అంతేకాదు....కార్లు - బైక్లు - బంగ‌ళాలు....ప్ర‌తి ఒక్కరికీ ప‌ది వేలు విలువ చేసే గిఫ్ట్....ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌ను భార‌త్ లో మ‌నం నిత్యం చూస్తూనే ఉంటాం. ఉద్యోగాల పేరుతో యువ‌కుల నుంచి ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేసి బోర్డు తిప్పేసే బోగస్ కంపెనీల గురించి వింటూనే ఉంటాం. న‌కిలీ చిట్ ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు....ఇలా ఒక‌టేమిటి...మోస‌పోయేవారుంటే చాలు ...మోసం చేసే కంపెనీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకోస్తూనే ఉన్నాయి...ఉంటాయి కూడా. ఒక‌వేళ ఇటువంటి బోగ‌స్ కంపెనీల గుట్టు ర‌ట్ట‌యినా...వారిని పోలీసులు ప‌ట్టుకున్న ఘ‌ట‌న‌లు వేళ్ల మీద లెక్క‌పెట్ట వ‌చ్చు....ఒక‌వేళ అరెస్టుల వ‌ర‌కు వెళ్లినా ఆ బ‌డాబాబులు ఎంచ‌క్కా బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి ద‌ర్జాగా బ్ర‌తికేస్తుంటారు. భార‌త్ లో పెండింగ్ లో ఉన్న ల‌క్ష‌ల కేసుల జాబితాలో ఆ కేసులు చేరి...మ‌గ్గిపోతుంటాయి. అయితే, థాయ్ ల్యాండ్ లో ఇటువంటి ఘ‌రానా మోస‌గాడికి అక్క‌డి కోర్టు దిమ్మ‌దిరిగే శిక్ష‌ విధించింది. రెండు దివాలా కంపెనీల ద్వారా ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఓ కేటుగాడికి 13 వేల సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌ను విధించింది.

థాయ్ ల్యాండ్ కు చెందిన 34 ఏళ్ల ఫుదిట్‌ కిట్టి ట్రాది లోక్ రెండు బోగ‌స్ కంపెనీల‌ను స్థాపించాడు. త‌న కంపెనీలో పెట్టుబడులు పెడితే...ఇబ్బ‌డిముబ్బ‌డిగా లాభాలు గడించ‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌ల‌కు గాలం వేశాడు. ఖరీదైన కార్లు, ఆస్తులు సొంతం చేసుకోవ‌చ్చ‌ని మాయమాటలు చెప్పాడు. ఫుదిట్‌ మాటలు నమ్మిన `అమాయ‌క‌` ప్ర‌జ‌లు అతడి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ ర‌కంగా పుదిట్ .....దాదాపు 574 మిలియన్ల భట్‌(థాయి కరెన్సీ) సేకరించాడు. 2015 ఆగస్టు నుంచి 2016 సెప్టెంబరు వరకు ఆ బోగ‌స్ కంపెనీల ద్వారా ఆ డబ్బును సేక‌రించి బిఛానా ఎత్తేశాడు. దాదాపు 2653 మంది ఆ మోస‌గాడిబారినప‌డి ల‌బోదిబోమ‌న్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం థాయ్‌ పోలీసులు ఫుదిట్ ను ఎట్ట‌కేల‌కు అరెస్టు చేసి న్యాయ‌స్థానంలో ప్ర‌వేశ‌పెట్టారు. శుక్రవారం అతడి కేసును విచారించిన న్యాయమూర్తి అతడికి 13,265 సంవత్సరాల‌ జైలు శిక్ష విధిస్తూ సంచ‌ల‌న తీర్పునిచ్చింది. అంతేకాదు, మనీలాండరింగ్ కు పాల్పడినందుకు గాను మరో పదేళ్లు అదనంగా జైలు శిక్ష విధించింది. అయితే, ఫుదిట్‌ ప్రజలను మోసం చేసినట్లు న్యాయస్థానం ఎదుట అంగీకరించడంతో అతడి శిక్షను కోర్టు సగం తగ్గించింది. దీంతో అతడు 6637 సంవత్సరాల ఆరు నెలలు జైలు శిక్షను అనుభవించ‌బోతున్నాడు. వాస్త‌వానికి, థాయ్ ల్యాండ్ పీనల్‌ కోడ్‌ ప్రకారం పుదిట్ చేసిన నేరానికి 20 సంవత్సరాల శిక్ష మాత్ర‌మే విధించాలి. అయితే, కానీ కేసు తీవ్రత, బాధితుల సంఖ్య‌ను బట్టి ఆ జైలు శిక్షను న్యాయ‌స్థానం విధించింది. భార‌త్ లో కూడా ఇటువంటి కేటుగాళ్ల‌కు స‌త్వ‌ర‌మే శిక్ష విధించేలా న్యాయ‌స్థానాలు చ‌ర్య‌లు చేప‌ట్టే రోజు త్వ‌ర‌లోనే రావాలని ఆశిద్దాం!