Begin typing your search above and press return to search.

మోడీ ఇలాకాలో పెళ్లికాని అమ్మాయిలు సెల్ వాడొద్దంటూ నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   17 July 2019 5:18 AM GMT
మోడీ ఇలాకాలో పెళ్లికాని అమ్మాయిలు సెల్ వాడొద్దంటూ నిర్ణ‌యం!
X
నింగిలోనూ.. నేల మీదా అమ్మాయిల వాటా అమ్మాయిల‌దే అంటూ బ‌డాయి క‌బుర్లు చెప్పే దానికి.. ఆచ‌ర‌ణ‌లో చూపే దానికి మ‌ధ్య పొంత‌న కుద‌ర‌టం లేదు. అమ్మాయిల మీద ఆంక్ష‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ప్ర‌పంచం మొత్తం డిజిట‌ల్ యుగంలోకి దూసుకెళుతున్నా.. మ‌న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణ‌యాలు షాకింగ్ గా ఉంటున్నాయి.

తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. అయితే.. ఆ గ్రామం ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హించే గుజ‌రాత్ రాష్ట్రానికి సంబంధించిన షాకింగ్ విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ రాష్ట్రంలోని బాణ‌స్కాంత గ్రామంలో ఇక‌పై ఠాకూర్ కులానికి చెందిన పెళ్లికాని అమ్మాయిలు ఇక‌పై సెల్ ఫోన్ వాడ‌కూడ‌ద‌ని తీర్మానించారు. ఈ నిర్ణ‌యాన్ని గ్రామ పెద్ద‌లు ఏక‌గ్రీవంగా తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఒక‌వేళ ఎవ‌రైనా ఠాకూర్ కులానికి చెందిన అమ్మాయిలు ఫోన్ ఉప‌యోగిస్తే.. ఆ అమ్మాయి తండ్రి నుంచి రూ.ల‌క్ష‌న్న‌ర మొత్తాన్ని జ‌రిమానాగా వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఠాకూర్ కుల‌పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యం వారి వ‌ర‌కూ వారి రాజ్యాంగంగా భావిస్తారు. దానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఈ పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాన్ని ప‌లు గ్రామాల వారు య‌థాత‌ధంగా అమ‌లు చేస్తుంటారు. అయితే.. ఈ నిర్ణ‌యం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే.. ఇదే పెద్ద‌లు మ‌రో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

పెళ్లిళ్ల సంద‌ర్భంగా అన‌వ‌స‌రంగా పెడుతున్న ఖ‌ర్చుల‌కు సైతం చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. వివాహ వేడుక‌ల్లో భాగంగా బాణ‌సంచా కాల్చ‌టం.. డీజేలు ఏర్పాటు చేయ‌టం లాంటివి కూడా ఉండ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యారు. ఇందుకు భిన్నంగా ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం నేరంగా ప‌రిగ‌ణించి వారికి శిక్ష‌లు వేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ గ్రామ పెద్ద‌లు తీసుకున్న నిర్ణ‌యాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే త‌ప్పు ప‌డుతున్నారు. సెల్ ఫోన్ కార‌ణంగా ప్రేమ‌లు పెరిగిపోతున్నాయ‌ని నిషేధం విధించార‌ని.. అలా అయితే.. తాను కూడా ల‌వ్ మ్యారేజీనే చేసుకున్న‌ట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఠాకూర్ కుల‌పెద్ద‌లు తీసుకున్న తాజా నిర్ణ‌యాల్ని దాదాపు ప‌ద‌కొండుకు పైగా గ్రామాల్లో అమ‌లు చేసేందుకు నిర్ణ‌యించారు. కుల పెద్ద‌ల నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.