Begin typing your search above and press return to search.

థ్యాంక్స్ కరోనా.. యుద్ధం మాట నోట రాకుండా చేశావ్

By:  Tupaki Desk   |   11 April 2020 2:30 AM GMT
థ్యాంక్స్ కరోనా.. యుద్ధం మాట నోట రాకుండా చేశావ్
X
బడాయి బతుకుల్ని ఆగమాగం చేయటమే కాదు.. జీవితం ఎంత సింపులో తెలుసా? అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసిన ఘనత కరోనా వైరస్ దేనని చెప్పాలి. నాకు మించినోడు ప్రపంచంలో మరెవరూ లేరంటూ విర్రవీగే మానవసమాజానికి సవాలు విసరటమే కాదు.. గజగజలాడిపోయేలా చేసింది. కంటికి కనిపించినంత సూక్ష్మమైన ఒక చిన్న వైరస్ ధాటికి మనిషి అనే మొనగాడు ఎంతలా విలవిలలాడిపోయామో ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. ప్రకృతిలో మనిషి ఒకడు తప్పించి.. ప్రకృతి మొత్తానికి అతడొక్కడేమీ కాదన్న విషయం బాగా అర్థమయ్యేలా చేసింది కరోనా.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంపన్న రాష్ట్రమని గొప్పలు చెప్పే పాలకులకు.. తమ పాలనలో ప్రజల బతుకులు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయన్న మాటను మళ్లీ చెప్పకుండా చేసిన టాలెంట్ కరోనాదేనని చెప్పాలి. వైరస్ విరుచుకుపడిన వేళ.. వైద్యపరంగా మన స్థాయి ఏమిటో అర్థమైపోవటమే కాదు.. అవును.. సరైన వైద్యాన్ని అందించటంలో మనం వెనుకబడే ఉన్నామన్న విషయాన్ని పాలకుల చేత చెప్పించేసింది. ప్రజలకు చేయాల్సిందెంతో ఉందన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసింది.

ఓ ఇరవై రోజుల పాటు ఏ పని చేయకుండా అందరూ ఎవరింట్లో వారు ఉండి పోతే.. ఖజానాలు ఎంతలా ఖల్లాస్ అయిపోతాయన్న విషయం పై క్లారిటీతో పాటు.. ఏదైనా సంక్షోభం ఎదురైత బతుకులు ఎంతలా ఆగమాగమైపోతాయన్న విషయం అర్థమయ్యేలా చేసింది. ఇటీవల కాలంలో యుద్ధాలు.. భారీ సంక్షోభాలు చూడని భారతీయులు.. ఈ మధ్య కాలంలో ఏదైనా తేడా వస్తే పొరుగు దేశంతో యుద్ధం చేయాలన్న రణ కుతూహాలాన్ని వ్యక్తం చేయటమే కాదు.. పెద్ద పెద్ద మాటల్ని చెప్పేసేవారు.

కరోనా పుణ్యమా అని.. మనకున్న వనరులు.. మన శక్తి సామర్థ్యాలు ఏమిటో అర్థమై పోవటమేకాదు.. మన ఆర్థిక పరిస్థితి ఎంత అల్పమైనదో కూడా అందరికి అర్థమై పోయేలా చేసింది కరోనా. ప్రకృతిలో మనిషి అనేటోడు ఎంత అల్పమైనోడన్న విషయాన్ని తెలిసేలా చేసి.. ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించకపోతే అంతే అన్న విషయాన్ని చెప్పిన కరోనాకు ప్రతి ఒక్కడూ థ్యాంక్స్ చెప్పాల్సిందే.