Begin typing your search above and press return to search.

ఆ సీఎంది స్వతంత్ర ఫ్రంట్... ?

By:  Tupaki Desk   |   1 May 2022 2:30 AM GMT
ఆ సీఎంది స్వతంత్ర ఫ్రంట్... ?
X
ఆయన విలక్షణమైన రాజకీయ వేత్త. పుస్తకాల పురుగు. అలాగే విద్యాధికుడు. ఇక తండ్రి నుంచి రాజకీయాన్ని వారసత్వంగా కంటే బాధ్యతగా తీసుకున్నారు. ఆయనే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. తండ్రి బిజూ పట్నాయక్ సీఎం కావడానికి చాలా కష్టపడ్డారు. అలా అయ్యాక కుదురుకున్నది, ఏలింది కూడా తక్కువకాలమే.

కానీ దేశంలో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతీ బాసు తరువాత రికార్డుని తిరగరాసే విధంగా నవీన్ పట్నాయక్ రాజకీయ విజయాలు ఉన్నాయి. ఇప్పటికి నాలుగు సార్లు వరసగా విజయం సాదించి రెండు దశాబ్దాలకు పైగా సీఎం గా ఆయన ఉన్నారు. మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఆయనదే విజయం అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

పాలనలో తనదైన మార్క్ ని చూపిస్తూ ఎపుడూ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే నవీన్ అంటే అన్ని రాజకీయ పార్టీలకు గౌరవం ఉంది. ఇక ఒడిషా అభివృద్ధి ఆయనతోనే పెద్ద ఎత్తున సాగుతోంది. ఒకసారి సీఎం అయితే చాలు ప్రధాని అయిపోవాలని కలలు కంటున్న రాజకీయ అత్యాశాపరులకు నవీన్ పూర్తి భిన్నం.

ఒడిషాలో 21 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒక విధంగా అది మంచి నంబరే. మెజారిటీ సీట్లు ఎపుడూ ఆయన పార్టీకే వస్తాయి. అలాగని ఆ సీట్లతో ఢిల్లీ వెళ్ళి రాజకీయాలు చేయాలని అనుకోలేదు. ఆయన తటస్థ విధానాలను ఎపుడూ చాటుకుంటూ వస్తున్నారు. చిత్రమేంటి అంటే ఆయన ఉన్న చోట ప్రధాన ప్రత్యర్ధి బీజేపీ ఉంది. అయినా సరే ఆయన ఆ పార్టీని ఏనాడూ పెద్దగా తూలనాడలేదు.

అదే పనిగా కేంద్రంలోని మోడీ మీద విమర్శలు చేస్తూ విరుచుకుపడలేదు. తన రాష్ట్రం, తన రాజకీయం, తన పనేంటో తానేంటో పూర్తిగా తెలిసిన రాజకీయ స్థిత ప్రజ్ఞత ఆయన సొంతం. అందుకే నవీన్ ది స్వతంత్ర ఫ్రంట్. ఆయనను తాజాగా ఢిల్లీ టూర్ లో మీడియా ఎదురుపడి పలకరించింది.

దేశంలో ఎన్నో ఫ్రంట్లూ, రాజకీయ స్టంట్లు సాగుతున్న వేళ మీ స్టాండ్ ఏంటి అని కూడా అడిగింది. దానికి ఆయన చెప్పిన సింపుల్ ఆన్సర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మాది స్వతంత్ర ఫ్రంట్. మేము అలాగే ఉంటామని. అంతే కాదు, తాము తమ స్వతంత్ర రాజకీయాలను ఎపుడూ కాపాడుకుంటూ ఉంటామని చెప్పుకున్నారు.

త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ ఫ్రంట్ కి ఏ అభ్యర్ధికి మీ మద్దతు అని మీడియా గుచ్చి గుచ్చి అడిగినా నవీన్ తడబాటు పడలేదు. అంత తొందర ఏముంది, రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో చూసి అపుడే తుది నిర్ణయం తీసుకుంటామని నవీన్ చెప్పుకొచ్చారు.

అంటే ఎన్డీయే అభ్యర్ధి, యూపీయే అభ్యర్ధికి చూసి వారి గుణగణాలను, అర్హతలను చూసి ఆయన స్వతంత్ర నిర్ణయం ప్రకటిస్తారు అన్న మాట. మొత్తానికి నవీన్ రాజకీయమే సెపరేట్ అన్నట్లుగానే ఆయన పంధా సాగుతోంది. నోరు విప్పకుండా మాట జారకుండా వర్తమాన రాజకీయమనే మహా సాగరాన్ని ఈజీగా ఈదేస్తున్న నవీన్ ని చూసి చాలా మంది రాజకీయ నేతలు స్పూర్తిగా తీసుకోవాలేమో.