Begin typing your search above and press return to search.

ఆ కలెక్టర్ కు శిక్ష తప్పాలంటే ఏం చేయాలో చెప్పిన కోర్టు

By:  Tupaki Desk   |   4 March 2021 7:32 AM GMT
ఆ కలెక్టర్ కు శిక్ష తప్పాలంటే ఏం చేయాలో చెప్పిన కోర్టు
X
కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన జిల్లా కలెక్టర్ కు విధించిన శిక్షను రద్దు చేయాలన్న వినతిపై హైకోర్టు ఆసక్తికరంగా స్పందించింది. 2017లో ఇచ్చిన తీర్పునకు సంబంధించి సింగిల్ కోర్టున్యాయమూర్తి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రస్తుతం కలెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ జె పాటిల్ తెలంగాణ హైకోర్టును కోరారు. ఇంతకీ ఆయనకు ఏ కేసులో శిక్ష విధించారన్నది చూస్తే.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పరమేశ్వర బిన్నీ రైసు మిల్లును బ్లాక్ లిస్టు నుంచి తొలగించి ధాన్యం సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదని రైస్ మిల్ యజమాని కోర్టు ధిక్కార పిటిషీన్ దాఖలు చేశారు.

దీన్ని విచారించిన హైకోర్టు.. అప్పటి జాయింట్ కలెక్టర్ గా ఉన్న ప్రశాంత్ జె పాటిల్ కు.. జిల్లా సరఫరా అధికారి సంధ్యా రాణికి రూ.2వేల జరిమానాను విధించారు. దీనికి సంబంధించి తీర్పు 2017లో వెల్లడించారు. ఈ తీర్పును ప్రశాంత్ సవాల్ చేశారు. దీనిపైతాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు కలెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ తరఫున న్యాయవాది వినిపించిన వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

కోర్టు ధిక్కారణకు పాల్పడిన అధికారి.. ఏదైనా సామాజిక సేవ చేయాలని పేర్కొంది. మీకు నచ్చిన మంచి పని చేసి.. దాని వివరాల్ని తమకు సమర్పించాలని.. తాము పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. దీంతో.. ఇప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ కు అర్జెంట్ గా ఒక మంచి పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. హైకోర్టు వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది కదా?