Begin typing your search above and press return to search.

కాక రేపుతున్న ఆ నియోజ‌క‌వ‌ర్గం.. కాంగ్రెస్ కార్యాల‌యానికి నిప్పు!

By:  Tupaki Desk   |   11 Oct 2022 9:30 AM GMT
కాక రేపుతున్న ఆ నియోజ‌క‌వ‌ర్గం.. కాంగ్రెస్ కార్యాల‌యానికి నిప్పు!
X
తెలంగాణ‌లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఓవైపు అధికార టీఆర్ఎస్, త‌మ సిట్టింగ్ సీటును ద‌క్కించుకోవ‌డానికి కాంగ్రెస్‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని పెద్ద ఆశ‌లే పెట్టుకున్న బీజేపీ ఈ స్థానంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇంకా చిన్న‌చిత‌కా పార్టీల త‌ర‌ఫున కూడా బ‌రిలో ఉన్నారు.

ఇప్ప‌టికే అయారాంగ‌యారాంలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇవ్వాళ ఒక పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ భారీ ఎత్తున వంద‌ల కోట్ల రూపాయ‌లు డ‌బ్బులు మంచి నీళ్ల ప్రాయంలా ఖ‌ర్చు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత బ‌లంగా ఉంది. త‌మ సిట్టింగ్ సీటు కావ‌డం, మిగ‌తా పార్టీల‌కు భిన్నంగా మ‌హిళ‌కు సీటు ఇవ్వ‌డంతో కాంగ్రెస్ విజ‌యంపై ధీమాగా ఉంది. స్వ‌యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఒక మండ‌లానికి బాధ్య‌త‌లు తీసుకోవ‌డంతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో క‌ద‌న‌రంగంలోకి దూకుతోంది.

ఈ నేప‌థ్యంలో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని చండూరులోని కాంగ్రెస్ కార్యాల‌యానికి నిప్పు పెట్టారు. అక్టోబ‌ర్ 11న మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ ప‌ని చేశార‌ని తెలుస్తోంది. ఈ ఘటనలో పార్టీ ప్రచార సామాగ్రి దగ్ధమైంది.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి రోడ్ షో కోసం నిల్వ ఉంచిన పార్టీ జెండాలు, పోస్టర్లు, కండువాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు ప్రత్యర్థి పార్టీలే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అక్టోబ‌ర్ 10 సోమ‌వారం రాత్రి 11 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉన్నామని, అయితే ఉదయం కార్యాలయానికి వచ్చేసరికి భారీ పొగ‌తో కార్యాల‌యం నిండి ఉంద‌ని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. కార్యాల‌యానికి నిప్పు పెట్ట‌డంతో ప్ర‌చార సామ‌గ్రి మొత్తం ధ్వంస‌మైపోయింద‌ని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను చూసి ఫాసిస్టు బీజేపీ, అధికార‌ టీఆర్‌ఎస్‌ భయపడుతున్నాయన్నారు. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల కు ఉన్న‌ ఓటమి భయాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు.

కాగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో చేరేందుకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు లభించిందంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అతికించిన విష‌యం తెలిసిందే. దీనికి
ప్రతీకార చర్యగానే తమ కార్యాలయానికి నిప్పుపెట్టినట్లు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.

చండూరులో కాంగ్రెస్ కార్యాల‌యానికి నిప్పు పెట్టిన‌ ఘటనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు లభిస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యర్థులు నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిప‌డ్డారు.ఇలాంటి చర్యలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేవని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కాగా నవంబరు 3న మునుగోడుకు ఉప ఎన్నిక జరగనుంది. న‌వంబ‌ర్ 6న ఫ‌లితం వెల్ల‌డ‌వుతుంది. కాంగ్రెస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

ఈ నేప‌థ్యంలో మునుగోడులో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించగా, కాంగ్రెస్‌ తరఫున దివంగ‌త కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.