Begin typing your search above and press return to search.

విదేశాల‌కు ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఆ దేశం!

By:  Tupaki Desk   |   25 July 2022 3:55 AM GMT
విదేశాల‌కు ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఆ దేశం!
X
భార‌త్ దాయాది దేశం.. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌లో దుర్భ‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. శ్రీలంక దుస్థితిలోకి పాక్ కూడా జారుకుంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో దేశాన్ని ఆర్థికంగా గ‌ట్టెక్కించ‌డానికి విదేశాల‌కు దేశ ఆస్తుల‌ను విక్ర‌యించాల‌ని పాకిస్థాన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బిల్లు కూడా ఆమోదించింది.

పాకిస్తాన్ రూపాయి ఈ వారం రోజుల్లోనే దాని విలువలో 8.3 శాతం క్షీణించింది. నవంబర్ 1998 త‌ర్వాత రూపాయి దారుణంగా దిగ‌జారింది ఇప్పుడే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) నుంచి 1.17 బిలియన్‌ డాలర్ల రుణాలు పొందటంలో పాక్ విఫలమైంది. దేశంలో ఆర్థిక అంత‌రాల‌ను త‌గ్గించడానికి మిత్ర దేశాల నుంచి 4 బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్‌ సూచించింది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.

ఈ నేప‌థ్యంలో విదేశాల‌కు ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ప్ర‌భుత్వం అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అన్ని ప్రక్రియల‌ను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. అప్పుల‌ ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. చివ‌ర‌కు దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించే అధికారం కోర్టుల‌కు కూడా లేకుండా ప్ర‌భుత్వం చేసింది. ఈ మేర‌కు 'ఇంటర్‌ గవర్నమెంటల్‌ కమర్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌ ఆర్డినెన్స్-2022'ను పాకిస్థాన్ కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది.

ఈ నేప‌థ్యంలో చమురు, గ్యాస్‌ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి విక్రయించేందుకు పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఈ అత్యవసర ఆర్డినెన్స్ తెచ్చింది. యూఏఈకి వాటాలు విక్ర‌యించ‌డం ద్వారా సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు పొందాలని ప్ర‌భుత్వం భావిస్తోంది.

అయితే తీసుకున్న గ‌తంలో తీసుకున్న‌ రుణాల‌ను చెల్లించే స్థితిలో పాకిస్థాన్‌ లేకపోవడంతో కొత్త రుణాలు ఇచ్చేందుకు యూఏఈ ప్ర‌భుత్వం ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది. అయితే.. తమ కంపెనీలు పాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ దేశం అంగీకరించాలని పేర్కొంది.

అయితే.. పాక్ ప్ర‌భుత్వం తెచ్చిన‌ ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఇంకా సంతకం చేయలేద‌ని చెబుతున్నారు. మరోవైపు.. దేశంలోని ఏదైన సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు 471 రోజుల సమయం పడుతుందని పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్‌ ఇస్మాయిల్‌ ఇటీవల పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది.