Begin typing your search above and press return to search.

ఆ డైమండ్ మాదే.. దాన్ని మాకు ఇచ్చేయాలంటున్న దక్షిణాఫ్రికా

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:31 AM GMT
ఆ డైమండ్ మాదే.. దాన్ని మాకు ఇచ్చేయాలంటున్న దక్షిణాఫ్రికా
X
ఎప్పుడూ లేని రీతిలోకొత్త డిమాండ్ ఒకటి దక్షిణాఫ్రియా నుంచి మొదలైంది. దశాబ్దాల పర్యంతం బ్రిటన్ ను ఏలిన మహరాణి ఎలిజబెత్ 2 కన్నుమూసిన తర్వాత ఆమె కిరీటంలో పొదిగి ఉన్న వజ్రాలు.. ఆమె చేతిలో ఉండే రాణి దండంలోని వజ్రం తమదేనంటూ కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది.

ఈ వజ్రాలు తమవేనని.. వాటిని తమకు ఇచ్చేయాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా రాణి దండంలో ఉండే గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని పిలిచే "కల్లినన్ డైమండ్" తమదేనని.. దానిని తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.

కల్లినన్ 1గా పేరునే ఈ 500 క్యారెట్ల డైమండ్ ను.. సౌతాఫ్రికాలో 1905లో జరిపిన మైనింగ్ లో లభ్యమైనట్లుగా చెబుతారు. ఈ గ్రేట్ స్టార్ వజ్రాన్ని ఆప్రికాలోని వలస పాలకులు బ్రిటన్ రాజకుటుంబానికి ఇచ్చారు. ఆ వజ్రాన్ని రాణి దండంపై అమర్చారు. అయితే.. ఆ వజ్రాన్ని తక్షణమే దక్షిణాఫ్రికాకు తిరిగి అప్పగించాలంటూ తండుక్సోలో సబేలో అనే సామాజిక కార్యకర్త డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియా మాధ్యమంలో మొదలైన ఈ డిమాండ్ కు పలువురు మద్దతు ఇస్తున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల విలువైన ఖనిజాలు బ్రిటన్ కు ప్రయోజనం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. కల్లినన్ వజ్రాన్ని తమ దేశానికి తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ కు అనుకూలంగా జరుగుతున్న ప్రచారానికి మద్దతుగా ఇప్పటికే 6 వేల మంది ఆన్ లైన్ పిటిషన్ కు సంతకాలు చేశారు.

తమ నుంచి ఎత్తుకెళ్లిన బంగారం.. వజ్రాలన్నీ తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ ను దక్షిణాఫ్రికా ఎంపీ వుయోల్వేతు జుంగులా డిమాండ్ చేశారు. అరుదైన వజ్రంగా అభివర్ణించే కల్లినన్ వజ్రం విలువ ఎంతన్నది చెప్పటం లేదు.

ప్రస్తుతం ఆ వజ్రం టవర్ ఆఫ్ లండన్ లోని జ్యువెల్ హౌస్ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇదిలా ఉంటే.. రాణి కిరీటంలోని కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.