Begin typing your search above and press return to search.

అందుకే ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇస్తున్నాం: వైఎస్సార్సీపీ

By:  Tupaki Desk   |   24 Jun 2022 5:34 AM GMT
అందుకే ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇస్తున్నాం: వైఎస్సార్సీపీ
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఎన్డీయే అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన ద్రౌప‌ది ముర్ముకేన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించింది. దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా ఒక గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌పార‌ని.. అందువ‌ల్ల త‌మ మ‌ద్ద‌తు ఆమెకే ప్ర‌క‌టిస్తున్నామ‌ని ఆ పార్టీ వివ‌రించింది. దేశంలోనే సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక‌ పార్టీ త‌మ‌దేన‌ని తెలిపింది. మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో సామాజిక న్యాయాన్ని చూపుతున్న త‌మ పార్టీ గిరిజ‌న మ‌హిళ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నందువ‌ల్ల ఆమెకే త‌మ మ‌ద్ద‌తు అని వివ‌రించింది.

కాగా జూన్ 24న ద్రౌప‌ది ముర్ము ఎన్డీయే త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా దాఖ‌లు చేయ‌నున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రుకావ‌డం లేద‌ని వైఎస్సార్సీపీ తెలిపింది. ఆ రోజు ఏపీ మంత్రివర్గం సమావేశం ఉంటుంద‌ని ముందుగానే నిర్ణ‌యించామ‌ని.. అందువ‌ల్ల ద్రౌప‌ది ముర్ము నామినేష‌న్ కు హాజ‌రుకాలేక‌పోతున్నార‌ని తెలిపింది. అయితే ద్రౌప‌ది నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి తమ పార్లమెంటరీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి హాజరవుతారని వైఎస్సార్సీపీ వెల్ల‌డించింది. దీంతో జూన్ 24న శుక్రవారం నాటి ఏపీ మంత్రిమండ‌లి స‌మావేశం యథాతథంగా జరగనుంది.

కాగా ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ అభ్య‌ర్థిత్వానికి కూడా గ‌తంలో వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్డీయే కూటమిలో వైఎస్సార్సీపీ లేన‌ప్ప‌టికీ వివిధ అంశాల్లో, సంద‌ర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తూ వ‌స్తోంది.

కాగా, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము జూన్ 24న‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల తరపున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌కు 22 పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అయితే ద్రౌప‌ది ముర్ము విజ‌యం సాధించ‌డం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగ‌స్వామ్య పార్టీలతోపాటు బిజూ జ‌న‌తాద‌ళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా ద్రౌప‌ది ముర్ముకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో ఆమె సులువుగా విజ‌యం సాధిస్తార‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీ పెడతానని, బీజేపీ వ్యతిరేక పోరాటంలో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానని చెబుతున్న జాతీయ పార్టీకి మ‌రో తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి సహకారం అందదు అని తేలిపోయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ బేషరతుగా బీజేపీ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు తమ మద్దతును ప్రకటించ‌డమే ఇందుకు నిద‌ర్శ‌మ‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా వైఎస్సార్సీపీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న‌డ‌వ‌ద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో కేసీఆర్ కు నిరాశ త‌ప్ప‌ద‌ని పేర్కొంటున్నారు.